రికార్డు లడ్డూ
తాపేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరంలోని శ్రీభక్తాంజనేయ స్వీట్‌స్టాల్ గతంలో సాధించిన గిన్నిస్ రికార్డులను తిరగరాస్తూ తయారుచేసిన 8,300 కిలోల భారీ 'నవ్యాంధ్ర' లడ్డూను బుధవారం ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలించారు. 6,300 కిలోల మరో లడ్డూను విజయవాడకు తరలించారు. స్వీట్‌స్టాల్ అధినేత సలాది వెంకటేశ్వరరావు గత నాలుగేళ్లుగా వినాయక చవితికి అతిపెద్ద లడ్డూల తయారీతో వరుస గిన్నిస్ రికార్డులు నెలకొల్పారు. ఉత్సవ కమిటీల నుంచి ఆర్డర్లపై 2011లో 5,570 కేజీలు, 2012లో 6,599 కేజీలు, 2013లో 7,132 కేజీలు, 2014లో 7,858 కేజీల లడ్డూలు తయారుచేసి గిన్నిస్ రికార్డులను సాధించారు. ఈ ఏడాది విశాఖలో నెలకొల్పనున్న 80 అడుగుల భారీ గణనాథుని కోసం 8,300 కిలోల లడ్డూ తయారీ చేసి పాత రికార్డును తిరగరాశారు.
వెంకటేశ్వరరావుతో పాటు 14 మంది సిబ్బంది ఆరు గంటల వ్యవధిలో లడ్డూ తయారీని పూర్తిచేశారు. కాగా విజయవాడలో నెలకొల్పనున్న 53 అడుగుల డూండీ గణనాథుని కోసం 6,300 కిలోల లడ్డూను 4.50 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. బుధవారం వెంకటేశ్వరరావు దంపతులు ప్రత్యేక పూజల అనంతరం క్రేన్‌సాయంతో రెండు లడ్డూలను ప్రత్యేక వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. భారీ లడ్డూలను తిలకించేందుకు తాపేశ్వరం, పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. 8,300 కిలోల నవ్యాంధ్ర లడ్డూతో సరికొత్త గిన్నిస్ రికార్డుతో పాటు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు, వరల్డ్ అమేజింగ్ రికార్డ్సు, రికార్డు హోల్డర్స్ రిపబ్లిక్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్సు తదితర 13 రికార్డులు సాధించినట్టు శ్రీనుబాబు తెలిపారు.