గుంటూరు క్రైం : గురుపూజోత్సవ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసే ముఖ్యమంత్రి, మంత్రులకు విడిది ఏర్పాట్లతో పాటు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, భద్రతా చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే పోలీసు పరేడ్‌గ్రౌండ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కలెక్టర్ కాంతిలాల్ దండే, జేసీ వివేక్‌యాదవ్, కళాశాల విద్య కమిషనర్ కె.సునీతలతో పాటు విజయవాడ కమిషనర్, అడిషనల్ డీజీపీ, ఏబీ.వెంకటేశ్వరరావు, ఐజీ పీవీ సునీల్ కుమార్, ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ ముఖ్యమంత్రి ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. వేదికతోపాటు కార్యక్రమానికి హాజరయ్యే వారందరికీ కావాల్సిన సదుపాయాలను పూర్తి చేశారు. అర్బన్ ఎస్పీ రాజేష్‌కుమార్ 45 రోజులపాటు శిక్షణకు వెళ్ళడంతో ఐజీతో రూరల్ ఎస్పీ పి.హెచ్.డి.రామకృష్ణ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఐజీ, రూరల్ ఎస్పీతోపాటు, ఏడుగురు అదనపు ఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 300 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో సహ మొత్తం 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌లతో తనిఖీలు చేయించారు. నగరంలోని లాడ్జిలు, హోటళ్ళల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు వరకు ముఖ్యమంత్రి కాన్వాయ్ వాహనాలతో ట్రయల్ రన్ నిర్వహహించారు.
బాధ్యతగా విధులు నిర్వహించాలి..
ముఖ్యమంత్రి కార్యక్రమం పూర్తయి తిరిగి వెళ్లే వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఐజీ సునీల్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో అధికారులతో ఆయన సమావేశమయ్యారు. భద్రతా,ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి సమస్యలు తలెత్తితే నిమిషాల వ్యవధిలో సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సమావేశంలో ఎస్పీ రామకృష్ణతో పాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
నిఘా నీడలో గుంటూరు నగరం
Published Fri, Sep 5 2014 1:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement