మమ్మల్ని మనుషులుగా చూడండి
గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదుట తాళాయపాలెం రైతుల ఆవేదన
ఎలా బతకాలంటూ కన్నీటిపర్యంతమైన మహిళలు
తుళ్లూరు : ‘మమ్మల్ని మనుషులుగానే చూడటంలేదు. అధికారులు, కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారు. మా ఇళ్ల పక్క నే పెద్దపెద్ద గోతులు తీసి ఇసుకను తోడేస్తున్నారు. మా ఇళ్లు కూల్చేందుకు తెగబడుతున్నారు’ అంటూ తాళాయపాలెం గ్రామానికి చెందిన మహిళలు జిల్లా కలెక్టర్ కాంతి లాల్ దండే ముందు కన్నీటిపర్యంతమయ్యారు. శుక్రవారం తాళాయపాలెం లంకలోని పుష్కర ఘాట్‌ను పరిశీ లించేందుకు ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక అధికారి అనంతరాములుతో కలసి కలెక్టర్ వచ్చేశారు. పుష్కర ఘాట్‌ను పరిశీలించి వెళుతుండగా బాధితులు పెద్దసంఖ్యలో కలెక్టర్ కాన్వాయ్‌కు అడ్డుగానిలిచి ‘కలెక్టర్ కారు దిగి రావాలి. మా గోడు వినాలి’ అని నినాదాలు చేశారు. దీంతో కలెక్టర్ తప్పని పరిస్థితిలో వాహనం దిగి ఆందోళన చేస్తున్న బాధితుల వద్దకు వెళ్లారు. రెండో విడత కౌలు చెక్కులు కూడా రైతులు తీసుకుంటున్నారని, అసైన్‌డ భూముల రైతులకు మాత్రం మొదటి దఫా కౌలు చెక్కులు కూడా ఇవ్వలేదని బాధితులు తెలిపారు.
తమ నివాసాలకు ఆనుకుని ఇసుక డంపింగ్‌లు చేస్తున్నారని, ఇసుక తోడేస్తూ గోతులు తీస్తున్నారని, ఇలాగే కొనసాగితే తమ నివాసాలు కూలిపోతాయని కలెక్టర్‌కు వివరించారు. వివిధ రకాలుగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తాళాయపాలెం లంక వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారి తమ పరిస్థితిని స్వయంగా చూడాలని బాధితులు కోరగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే వెళ్లి పరిశీలించారు. స్పందించిన కలెక్టర్ పుష్కర ఘాట్‌ల పనుల వల్ల స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబును ఆదేశించారు. అనంతరం అసైన్‌డ బాధితుల గురించి మాట్లాడుతూ అసైన్‌డ భూములపై ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చిందని, త్వరలో లబ్ధిదారులకు కౌలు చెక్కులు వస్తాయని హామీ ఇచ్చారు. దీంతో లంకవాసులు శాంతించారు.