స్పెషల్ డ్రెస్‌లు.. బటన్ కెమెరాలు | Gurivi Reddy group arrested in Hitech Mass Copying | Sakshi
Sakshi News home page

స్పెషల్ డ్రెస్‌లు.. బటన్ కెమెరాలు

Published Sun, Feb 2 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

స్పెషల్ డ్రెస్‌లు.. బటన్ కెమెరాలు

స్పెషల్ డ్రెస్‌లు.. బటన్ కెమెరాలు

 వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షల్లో కాపీయింగ్‌కు స్కెచ్  గురివిరెడ్డి ముఠా గుట్టురట్టు

 సాక్షి, కర్నూలు:
 గ్రామ రెవెన్యూ ఆఫీసర్, సహాయకుల పరీక్షల లీకేజీకి యత్నిస్తున్న గురివిరెడ్డి ముఠా గుట్టు రట్టయింది. మాల్‌ప్రాక్టీస్‌కు మారుపేరైన గురివిరెడ్డి ముఠా అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు చేస్తున్న యత్నాలను కర్నూలు జిల్లా పోలీసులు ఛేదించారు. గురివిరెడ్డి 2010లో ఎంసెట్, 2012లో చండీఘర్ రాష్ట్రంలో ఎంబీబీఎస్, పీజీ ఎంట్రన్స్‌లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడి దొరికిపోయాడు. కొంతకాలం జైలుజీవితం కూడా గడిపాడు. అయినా కుక్కతోక వంకరలా తాజాగా వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షలపై కన్నేశాడు. అయితే ఈ ముఠాతో విభేదాలు వచ్చిన ఒకరు ఫిర్యాదు చేయడంతో కర్నూలు జిల్లా పోలీసులు దాడిచేసి గురివిరెడ్డితోపాటు మరో ఐదుగురు యువకులను అరెస్టు చేశారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి వెల్లడించారు. వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాదిమంది నేడు పరీక్షలు రాయనున్న సంగతి తెలిసిందే.
 ఇదీ పథకం...

  •      వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడంలో సిద్ధహస్తుడు. వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్‌కు పథకం వేసిన గురివిరెడ్డికి స్థానికంగా ప్రముఖుడైన ఒక న్యాయవాది కుమారుడు ప్రదీప్‌రెడ్డి తోడయ్యాడు. ఒక్కొక్కరికి రూ.మూడు లక్షల చొప్పున గుంటూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో 50 మందితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షలు మాట్లాడుకుని కొంత వసూలు చేసుకున్నారు.
  •      ఇందుకు కావాల్సిన అత్యాధునిక పరికరాలకోసం గురివిరెడ్డి మొదట చైనా కంపెనీలతో సంప్రదింపులు జరిపాడు. అయితే ఆ పరికరాలను భారత్‌కు చేరవేయటానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయని అతనికి మెయిల్ ద్వారా సమాచారం అందింది. దీంతో ఢిల్లీలో తనకు తెలిసిన వారిని సంప్రదించి తనకు కావాల్సిన పరికరాలను తెప్పించుకున్నాడు.
  •     గురివిరెడ్డి పథకం ప్రకారం పరీక్షలు రాసే అభ్యర్థులు వేసుకున్న చొక్కాలకు బటన్‌సైజ్ రంధ్రాలు ఏర్పాటు చేసి అందులో అతి చిన్న కెమెరాలు పెట్టి లోనికి పంపుతారు. ప్రశ్నపత్రాలను తీసుకున్న అభ్యర్థులు వాటిని ఈ చిన్న కెమెరాతో స్కాన్ చేసి బ్లూటూత్ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద వేచి ఉన్న ముఠా సభ్యులకు పంపుతారు.
  •     అభ్యర్థుల చెవిలో గురివింద గింజ సైజులో బ్లూటూత్ ఉంటుంది. వీటికి సిగ్నల్స్ సరిగా అందేందుకు చొక్కాలోపల రాగితీగ ఏర్పాటు చేస్తారు. ముఠా సభ్యులు గైడ్స్‌లో వెతికి సిద్ధం చేసిన జవాబులను సెల్‌ఫోన్ ద్వారా చెప్తుండగా... అభ్యర్థులు బ్లూటూత్ ద్వారా విని చకచకా నింపేస్తారు.

 
 ముఠా గుట్టు రట్టయిందిలా...

  •     గురివిరెడ్డి నంద్యాల పద్మావతినగర్‌లోని నాగిరెడ్డి అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. ఒప్పందం కుదుర్చుకున్న అభ్యర్థులను అక్కడకు పిలిపించుకుని కెమెరాలు ఎలా దాచుకోవాలి... ప్రశ్నపత్రాన్ని ఎలా ఫొటోలు తీయాలి... బ్లూటూత్‌ను ఎలా ఉపయోగించాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చేవాడు.
  •     వీరితో విభేదాలు రావడంతో నంద్యాల పట్టణానికి చెందిన ఆకుల చాంద్‌బాషా గత నెల 31న నంద్యాల రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించి నిందితుల నుంచి మాల్‌ప్రాక్టీస్‌కు ఉపయోగిస్తున్న సెల్‌ఫోన్లను, ఆధునిక బ్లూటూత్  పరికరాలను వాటిద్వారా లబ్ధిపొందే అభ్యర్థులు ధరించేందుకు వీలైన డ్రెస్సులు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
  •     {పధాన నిందితుడు గురివిరెడ్డితో పాటు అతని ముఠా సభ్యులైన నంద్యాలకు చెందిన కాకర్ల కిరణ్‌కుమార్, గోనె జార్జి ఇమ్మానియేల్, గోనె దేవరాజు, రామాయణం ధర్మతేజ, విజయవాడకు చెందిన కల్యాణ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
  •     కుట్రలో మరో ప్రధాన నిందితుడైన ప్రదీప్‌రెడ్డితోపాటు హైదరాబాద్‌కు చెందిన రాకేష్, తిరుపతికి చెందిన కిరణ్, నంద్యాలకు చెందిన కిరణ్, మరికొందరు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ రఘురామిరెడ్డి వివరించారు.

 
 ఎవరీ గురివిరెడ్డి?

     వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గురివిరెడ్డి ఇంటర్ పూర్తి చేశాక, మూడేళ్లకు ఎంసెట్‌లో ర్యాంక్ సాధించాడు. నంద్యాలలోని శాంతిరాం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఐదేళ్ల కోర్సు పూర్తయినా కొన్ని సెమిస్టర్‌లలో సబ్జెక్టులు పాస్ కాలేదు. వైద్య విద్య చదువుతున్నా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఎక్కువ.
     బ్లూటూత్‌ను ఉపయోగించి ఎంసెట్ పేపర్ లీకేజీకి ప్రయత్నించి 2010లో పట్టుబడ్డాడు. జైలునుంచి వచ్చాక కూడా ప్రవర్తనలో మార్పురాలేదు. 2012లో చండీఘర్ మెడికల్ వర్సిటీ ఎంబీబీఎస్, పీజీ ఎంట్రన్స్ పరీక్షా పత్రాల లీకేజీకి ప్రయత్నించి మరోసారి పట్టుబడ్డాడు.
     జైలునుంచి వచ్చాక కొద్దినెలలు అజ్ఞాతంలో ఉన్న గురివిరెడ్డి తాజాగా వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలపై కన్నేసి మరోసారి పట్టుబడ్డాడు.
 
 నేడే వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్షలు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్‌ఏ) రాత పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం వీఆర్‌వో పరీక్షకు 13,23,881 మంది, వీఆర్‌ఏ పరీక్షకు 97,703 మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 98 శాతం మందికి పైగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీ స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచిన ప్రశ్నపత్రాలను ఆదివారం ఉదయం పరీక్ష కేంద్రాలకు పోలీసు భద్రతతో తరలించేందుకు కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు.
    వీఆర్‌వో పరీక్ష 3,684 కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి 12 వరకు జరుగుతుంది. వీఆర్‌ఏ పరీక్ష 195 కేంద్రాల్లో మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు.
    పరీక్షల పర్యవేక్షణ కోసం ఏపీపీఎస్సీ 88 మంది సిబ్బందిని నియమించింది.
    పరీక్ష ముగిసిన తరువాత ఓఎంఆర్ జవాబు పత్రాలను ప్రత్యేక బస్సుల్లో పోలీసు భద్రతతో ఏపీపీఎస్సీ కార్యాలయానికి  తరలిస్తారు.
    సోమవారం నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని స్కానింగ్ విధానంలో నిర్వహిస్తారు.
    వాల్యుయేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 14వ తేదీ కల్లా పూర్తి చేసి ఫలితాల ప్రకటన కోసం ర్యాంకులను కలెక్టర్లకు పంపేలా ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది.
 కర్నూలు పోలీసులకు రఘువీరా అభినందనలు

 ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కర్నూలు జిల్లాలో వీఆర్‌వో, వీఆర్‌ఏ పరీక్ష ప్రశ్నపత్రాలను లీక్ చేసేందుకు ప్రయత్నించిన గురివిరెడ్డి ముఠాను అరెస్టు చేసిన పోలీసులను, అధికారులను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement