సాక్షి, గుంటూరు:
జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్కనిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ తెలిపారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 83 వీఆర్‌వో స్థానాలకు 76,573మంది, 425 వీఆర్‌ఏ పోస్టులకు 12,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇందులో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 4,600 మంది ఉన్నారని పేర్కొన్నారు. వీఆర్వో పరీక్షకు 17 మండలాల్లో 193 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీఆర్‌ఏ పరీక్షకు 5 మండలాల్లో 26 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాస్థాయిలో జిల్లా రెవెన్యూ అధికారి సమన్వయకర్తగా వ్యవహరిస్తారనీ, సహాయకులుగా 15 మంది జిల్లా అధికారులను నియమించామనీ చెప్పారు. వీఆర్వో పరీక్షకు 49 రూట్లు, వీఆర్‌ఏ పరీక్షకు 9 రూట్లు, నిఘా బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మూడు నుంచి 4 కేంద్రాలకు ఒకరి వంతున మొత్తం 50 మందిని పరిశీలకులుగా నియమించినట్లు తెలిపారు.
ప్రతికేంద్రం వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతోపాటు అభ్యర్థులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ముద్రించి తీసుకున్న హాల్‌టిక్కెట్‌పై ఫోటోగానీ, అభ్యర్థి సంతకంగానీ గజిబిజిగా ఉన్నా, సరిగా కనబడకపోయినా ఒక తెల్లకాగితంపై అభ్యర్థి మూడు సంతకాలు చేసి ఫొటో అతికించి దానిపై గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించుకుని పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్‌కు అందించాలని సూచించారు. అభ్యర్ధి తనతోపాటు హాల్‌టిక్కెట్, బాల్‌పాయింట్ పెన్ను, పెన్సిల్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించేది లేదన్నారు. ప్రతి కేంద్రం వద్ద అభ్యర్థి వేలిముద్ర తీసుకుంటారన్నారు. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఎటువంటి అవకతవకలకు తావులేకుండా గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుంచి ఆర్టీసీ సహకారంతో బస్సుల్ని తిప్పుతున్నట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ ఎస్పీ సత్యనారాయణ, జేసీ వివేక్‌యాదవ్, డీఆర్వో కె.నాగబాబు పాల్గొన్నారు.
నిమిషం ఆలస్యమైనా... అనుమతించం
Published Sat, Feb 1 2014 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM
Advertisement
Advertisement