రక్షాబంధన్‌ వేళ.. ఎందుకీ శిక్ష | Gurukul School Principal not Allowed Raksha Bandhan Festival In Visakhapatnam | Sakshi
Sakshi News home page

రక్షాబంధన్‌ వేళ.. ఎందుకీ శిక్ష

Published Mon, Aug 27 2018 8:01 AM | Last Updated on Tue, Aug 28 2018 1:01 PM

Gurukul School Principal not Allowed Raksha Bandhan Festival In Visakhapatnam - Sakshi

పాఠశాల ఆవరణలో పడిగాపులు కాస్తున్న విద్యార్థినుల తల్లిదండ్రులు

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముల మధ్య ప్రేమానురాగాలకు  చిహ్నంగా నిర్వహించేది రక్షాబంధన్‌. అనిర్వచనీయమైన ఆనందాన్ని ఇచ్చే ఈ పండుగ జరపుకొనేందుకు, తాము ఎక్కడున్నా ఎప్పటికీ నీకు రక్షణగా ఉంటామని మళ్లీమళ్లీ సోదరిలకు భరోసా కల్పించేందుకు అన్నదమ్ములు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తారు. అయితే ఓ ప్రిన్సిపాల్‌ వారికి ఆ ఆనందం లేకుండా అడ్డుకున్నారు. కనీసం తమ చెలెళ్లు, అక్కలను చూడడానికి కూడా అనుమతి ఇవ్వకపోవడంతో పలువురు యువకులు, వారి తల్లిదండ్రులు పండగ వేళ తీవ్ర  క్షోభకు గురయ్యారు.  

విశాఖపట్నం, డుంబ్రిగుడ(అరకులోయ): మండలంలో యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్‌) ప్రిన్సిపాల్‌ నిర్వాకంతో రక్షాబంధన్‌ పండుగ వేళ గిరిజన విద్యార్థినులు, వారి అన్నదమ్ములు తీవ్ర క్షోభకు గురయ్యారు. మాకెందుకీ శిక్ష అంటూ ఆవేదన చెందారు. చివరకు గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఆదేశాల మేరకు రాఖీ కట్టేందుకు ప్రిన్సిపాల్‌ అంగీకరించడంతో కొంతమందికి  మాత్రమే ఆ ఆనందం దక్కింది.  వివరాలు ఇలా ఉన్నాయి. పాఠశాలలో చదువుతున్న తమ అక్క,చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకునేందుకు   చింతపల్లి, కొయ్యూరు, జీకే వీధి,ముంచంగిపుటు,పెదబయలు,హుకుంపేట,జి.మాగుడుల, డుంబ్రిగుడ, అరకులోయ, అనంతగిరి మండలాల నుంచి  సుమారు 150 మంది గిరిజన యువకులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఉదయం  యండపల్లివలస గురుకుల పాఠశాల(ఏపీఆర్‌)కు వచ్చారు.

అక్కడి ప్రిన్సిపాల్‌ అరుణజ్యోతి విద్యార్థినులను బయటకు పంపేందుకు నిరాకరించారు.   దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను చూసేందుకు దూరప్రాంతాల నుంచి ఎంతో ఆశగా వస్తే ఇలా అడ్డుకోవడమేమిటని గొడవకు దిగారు. అయినా ప్రిన్సిపాల్‌ ససేమిరా అనడంతో వారు గిరిజన సంక్షేశాఖ డిప్యూటీడైరెక్టర్‌ విజయ్‌కుమార్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సాయంత్రం నాలుగు గంటలకు కొంత మంది విద్యార్థినుల తల్లిదండ్రులను పాఠశాల లోపలికి వెళ్లేందుకు ప్రిన్సిపాల్‌ అనుమతించారు. వర్షం పడుతుండడంతో తడుస్తూ ఉండలేక చాలా మంది యువకులు, వారి తల్లిదండ్రులు అప్పటికే నిరాశతో  వెళ్లిపోయారు. దీంతో తమ అన్నదమ్ములకు రాఖీ కట్టలేకపోయామని పలువురు విద్యార్థినులు తీవ్ర వేదనకు గురయ్యారు.  ప్రిన్సిపాల్‌ తీరుపై   కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు.

పడిగాపులు కాశాం...
దూరం  ప్రాంతం నుంచి కుమార్తెను  చూసేందుకు, తమ్ముడితో రాఖీ కట్టించేందు ఉదయం 10 గంట లకు పాఠశాలకు వచ్చాం. అయితే ప్రిన్సిపాల్‌ అనుమతించలేదు. ఎంతో వేడుకున్నాం. మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశాం. అయినా ప్రిన్సిపాల్‌ కనికరించలేదు. తమ పిల్లలను కలుసుకునే అవకాశం ఇవ్వని ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి.     – కొండబాబు,విద్యార్థిని తండ్రి, జి.మాడుగుల మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement