ఖజానాకు కాసుల కళ | GVMC Budget Hikes With Tax | Sakshi
Sakshi News home page

ఖజానాకు కాసుల కళ

Published Thu, Apr 18 2019 11:41 AM | Last Updated on Mon, Apr 22 2019 10:48 AM

GVMC Budget Hikes With Tax - Sakshi

జీవీఎంసీ కార్యాలయం

మహా విశాఖ నగర పాలక సంస్థ ఖజానాలో రికార్డు స్థాయి ఆదాయం వచ్చి చేరింది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 302 కోట్ల లక్ష్యాన్ని అందుకుంది. ముఖ్యంగా రెవెన్యూ విభాగం మొండి బకాయిలపై ప్రత్యేక దృష్టి సారించడంతో చివరి నెలలో దాదాపు రూ.75 కోట్లు వసూలు చేసింది. ఆస్తి పన్నులు, నీటి ఛార్జీలు మొదలైన పన్నుల ద్వారా ఆదాయం అత్యధిక స్థాయిలో జీవీఎంసీకి వచ్చి చేరింది. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది పన్నులవసూళ్లకు ఆది నుంచే శ్రీకారం చుట్టారు.

విశాఖసిటీ: జీవీఎంసీ రెవెన్యూ విభాగం పన్నుల వసూళ్లలో తొలిసారిగా లక్ష్యానికి చేరువైంది. ఏటా నిర్దేశించుకున్న లక్ష్యానికి కూతవేటు దూరంలోనే వసూళ్లు నిలిచిపోయేవి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మాత్రం పన్నుల వసూళ్ల జోరు లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆస్తిపన్ను, నీటి పన్ను, వీఎల్‌టీ మొత్తం రూ.300 నుంచి రూ.305 కోట్లు వసూళ్ల లక్ష్యంగా నిర్దేశించుకోగా రూ.302 కోట్లు కార్పొరేషన్‌ ఖజానాలో చేరింది. గతేడాదితో పోలిస్తే అధికంగానే పన్నులు ఖజానాకు చేరాయి. మొత్తంగా ఆరు జోన్లతో పాటు అనకాపల్లి, భీమిలిలో ఉన్న ప్రైవేట్‌ ఆస్తుల నుంచి రూ.218,89,12,000, ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.11,77,46,000, కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నుంచి రూ.6,16,64,000, కోర్టు కేసుల ద్వారా రూ.20,70,57,000, ఖాళీ స్థలాల పన్నుల ద్వారా రూ.35,23,10,000, విశాఖ పోర్టు ట్రస్టు నుంచి రూ.9.42 కోట్లు వచ్చాయి. మొత్తంగా 8 జోన్ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.302,18,89,000 వసూలయ్యాయి. దీనికి తోడు అన్ని జోన్ల నుంచి రూ.23,75,86,000 నీటి పన్నులు వసూలయ్యాయి.

‘మొండి’ఘటాలకు ముకుతాడు
ఈ ఏడాది నిర్దేశించుకున్న లక్ష్యాన్ని ఎలాగైనా చేరుకోవాలని జీవీఎంసీ అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా పన్ను వసూళ్లకు గుదిబండలా మారుతున్న మొండిబకాయిలనే ప్రధాన టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఆ దిశగా సఫలీకృతులయ్యారు.  గ్రేటర్‌ పరిధిలో మొత్తం 4.5 లక్షల ఆస్తి పన్ను అసెస్‌మెంట్లు ఉన్నాయి. కమిషనర్‌ హరినారాయణన్‌ ప్రత్యేక దృష్టి సారించి మొండి బకాయిల వసూళ్లపై చర్యలు తీసుకోవాలని డీసీఆర్‌ సోమన్నారాయణకు ఆదేశాలు జారీ చెయ్యడంతో కొత్త ప్రణాళికలతో ముందుకెళ్లారు. కొన్నేళ్లుగా వసూలు కాని మొండి బకాయిలు వసూలయ్యాయి. ఆయా జోన్లలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌కలెక్టర్‌లు పన్నుల వసూళ్లలో కీలక పాత్ర పోషించారు. ఇలా వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో మార్చి 30వ తేదీన ఒక్కరోజే ఏకంగా రూ.30 కోట్ల వరకూ గ్రేటర్‌ ఖజానాకు చేరాయి. ఒక్క రోజులో ఇంత పెద్ద మొత్తంలో పన్నులు వసూలు కావడం జీవీఎంసీ చరిత్రలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి బకాయిలు పడిన గీతం యూనివర్సిటీ రూ.10.41 కోట్లు, గాయత్రీ విద్యాసంస్థలు రూ.2.15 కోట్లు, వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ రూ.5.16 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టు రూ.4కోట్లు చెల్లించాయి. ఆం«ధ్రా యూనివర్సిటీ రూ.5.60 కోట్లు.... ఇలాంటి వసూళ్లతో లక్ష్యానికి చేరుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రధాన దృష్టిసారించడంతో పన్నుల వసూళ్లు పుంజుకున్నాయి.

30లోగా ఆస్తిపన్నుచెల్లింపులపై 5 శాతం రాయితీ
కమిషనర్‌ సూచనల మేరకు పన్నుల వసూళ్ల విషయంలో రెవెన్యూ విభాగం నిరంతరం కృషి చేసింది. అందరూ శక్తి వంచన లేకుండా శ్రమించినందుకు రికార్డు స్థాయిలో వసూళ్లు ఆనందాన్నిచ్చాయి. ఇదే స్ఫూర్తితో 2019–20 ఆర్థిక సంవత్సరంలో ముందుకెళ్లాలని నిర్ణయించాం. ఈ ఏడాది జీవీఎంసీ పరిధిలో ఆస్తిపన్నును ఈనెల 30వ తేదీలోగా చెల్లించేవారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ సదుపాయం కల్పించింది. ఆస్తిపన్నును చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుంది. జీవీఎంసీ పరిధిలోని మధురవాడ, ఆశీలమెట్ట, సూర్యాబాగ్, జ్ఞానాపురం, వేపగుంట, గాజువాక, భీమిలి, అనకాపల్లి జోనల్‌ కార్యాలయాల్లోని సౌకర్యం కేంద్రాలు, ఎంపిక చేసిన బ్యాంకుల్లోను పన్నులు చెల్లించాలని ప్రజలకు సూచిస్తున్నాం.– ఆర్‌.సోమన్నారాయణ, జీవీఎంసీ డీసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement