మృత్యు దూతలు | Dogs Threat In Visakhapatnam Out Cuts | Sakshi
Sakshi News home page

మృత్యు దూతలు

Jul 27 2018 1:30 PM | Updated on Sep 29 2018 4:26 PM

Dogs Threat In Visakhapatnam Out Cuts - Sakshi

విశాఖ నగరంలో రాత్రి వేళ గుంపుగా సంచరిస్తున్న శునకాలు

విశాఖ సిటీ: నగర శివారు గుడ్లవానిపాలెంలో జనవరి ఒకటో తేదీన ఐదేళ్ల బాలుడు రాముపై ఓ కుక్క దాడి చేసి నోట కరచుకొని లాక్కెళ్లిన ఘటన మరవకముందే.. అనకాపల్లిలో పదేళ్ల బాలికను తీవ్రంగా గాయపరచడంతో కోమాలోకి వెళ్లి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న దారుణం చోటు చేసుకుంది.

ఈ దారుణాలకు బాధ్యులెవరు..?
కుక్కలు ఇంతలా పేట్రేగుతున్నా.. అరికట్టడంలో విఫలమవుతున్న జీవీఎంసీనా..?
కుక్కల్ని పట్టుకుంటే.. విడిచిపెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న మూగ జీవాల సంరక్షణ సంస్థ ప్రతినిధులా..?
కుక్కల్ని చంపకూడదు.. కు.ని. చికిత్సలు చేసిన తర్వాత ఎక్కడ పట్టిన శునకాలను అక్కడే విడిచిపెట్టాలని ఆదేశాలిచ్చిన న్యాయస్థానమా..?
బాధ్యులెవరైనా.. బాధలు మాత్రం సామాన్య ప్రజలే ఎదుర్కొంటున్నారు. కుక్కల దాడుల్లో నిత్యం గాయపడుతున్నారు.

నగరంపై శునకం దాడి చేస్తోంది. రాత్రి పూట అయితే జనావాసం కంటే శునకాలే అధికంగా కనిపిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లాలన్నా.. ఆరుబయట ఆడుకోవాలన్నా చిన్నారులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి దాపురించింది. చీకటి పడితే చాలు పాదచారులు, ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ తరుముతున్నాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందనీ, వాటిని తొలగించాలని కార్పొరేషన్‌ అధికారులకు ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నగరంలో ఇదీ దుస్థితి
జీవీఎంసీ అధికారుల లెక్క ప్రకారం నగరంలో 2012లో ఉన్న వీధి కుక్కల సంఖ్య సుమారు 70 వేలు. ప్రస్తుతం ఇవి సుమారు ల„ýక్ష ఉంటాయని చెబుతున్నా.. మొత్తం సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో 70 వేల కుక్కల వరకూ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే అధికారికంగా మరో 30 వేలు మొత్తమ్మీద మరో 70 వేల కుక్కల వరకూ శస్త్ర చికిత్సలు చెయ్యాల్సిన అవసరం ఉంది.

రూ.కోట్లు కుమ్మరిస్తున్నా తగ్గవెందుకు.?
జీవీఎంసీ అధికారులు కుక్కల నియంత్రణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీతో పాటు విశాఖ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ కేర్‌ ఆఫ్‌ యానిమల్స్‌(వీఎస్‌పీసీఏ) అనే సంస్థతో కలిసి ఈ యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కార్యక్రమం నగరంలో జరుగుతోంది. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసేందుకు రూ.1100 చొప్పున.. ఏడాదికి కుక్కల కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నా... నగరంలో మాత్రం శునకాల బెడద తీరకపోవడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఒక కుక్క కాన్పులో సుమారు 8 పిల్లలను కంటుంది. ఏటా లక్ష్యం పేరుతో 15 వేల కుక్కల వరకూ ఆపరేషన్లు చేస్తున్నారు. మిగిలిన కుక్కల్లో సగానికిపైగా ఆడ కుక్కలు ఉంటున్నాయి. వచ్చే ఏడాది నాటికి వీటిలో సగం కుక్కలు పిల్లలను కంటున్నాయి. అంటే ఏడాది తిరిగేలోపు సుమారు 25 నుంచి 30 వేల కుక్కల వరకూ పెరుగుతున్నాయి. ఈ లెక్కన టార్గెట్ల పేరుతో సగం సగం ఆపరేషన్లు చేస్తున్న కొద్దీ మరో 30 వేల కుక్కలు అదనంగా పెరుగుతూ వస్తున్నాయే తప్ప.. తగ్గుతున్న దాఖలాలు లేవు.

సుప్రీంకోర్టు నిబంధనలే కారణమా..?
కుక్కల సమస్య తగ్గాలంటే వాటి చంపాల్సిందేనన్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కుక్కల్ని చంపకుండా వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి పట్టుకున్న చోటే తిరిగి విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి అలవాటు పడిన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కుక్కలను తీసుకెళ్లి విడిచిపెడితే... అక్కడి పరిస్థితులకు అలవాటు పడక వాటి మానసిక స్థితి గతితప్పి పిచ్చికుక్కలా ప్రవర్తించి మనుషులను కరిచే ప్రమాదముందని వైద్య నిపుణులు వెల్లడించడంతో.. సుప్రీంకోర్టు ఈ తరహా ఆదేశాలను జారీ చేసింది. దీంతో వీధుల్లో కుక్కలను పట్టుకొని శస్త్ర చికిత్సలు నిర్వహించి తిరిగి అక్కడే విడిచి పెడుతున్నారు. మరోవైపు జంతు ప్రేమికులు సైతం తమకు అడ్డు తగులుతున్నారని జీవీఎంసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడి కుక్కలను తరిమేసేందుకు యత్నిస్తుంటే.. వివిధ జంతు ప్రేమికుల సంఘాలు తమ పనికి అడ్డుతగులుతున్నాయ నీ... ఫలితంగా ఏమీ చెయ్యలేకపోతున్నామని జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది చెబుతున్నారు.

శివారు ప్రాంతాల్లో నియంత్రించలేకపోతున్నాం
ఎండాడ, సాగర్‌నగర్, పెందుర్తి, గోపాలపట్నం, పీఎం పాలెం, అనకాపల్లి శివారు ప్రాంతాల్లో కుక్కల నియంత్రణ కుదరడం లేదు. కుక్కల బండి కనిపిం చగానే ఆ ప్రాంతంలోని కుక్కలన్నీ కొండల్లోకి వెళ్లిపోతూ దొరకడం లేదు. కుక్క కాటుని పూర్తిగా నియంత్రించాలంటే ప్రజలు, జంతు ప్రేమికుల సహకారం అవసరం. కుక్కలను తరిమెయ్యాలని మేం చేసే ప్రయత్నాలను వారు అడ్డుకుంటున్నారు.  అనకాపల్లిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. శివాజీపార్కులో రోజూ పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. వాటిని తరలిద్దామని ప్రయత్నిస్తుంటే కుక్కల ప్రేమికులు అడ్డుపడుతున్నారు. ఇక మేమేం చెయ్యగలం.          – డాక్టర్‌ ఎల్‌కే సుధాకర్, జీవీఎంసీ చీఫ్‌ వెటర్నరీ ఆఫీసర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement