హెచ్‌ఎంలకే పరీక్ష | H.M for test | Sakshi
Sakshi News home page

హెచ్‌ఎంలకే పరీక్ష

Published Mon, Dec 15 2014 1:46 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

H.M for test

చిలకలూరిపేట: పాఠశాల విద్యాశాఖ ముందు చూపు, ప్రణాళిక లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలు ప్రధానోపాధ్యాయుల పాలిట గుదిబండగా మారుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమైన అంతర్గత పరీక్షల నిర్వహణ రాను రాను కష్టంగా మారుతోంది. ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు విద్యా బోధన, పర్యవేక్షణ, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై సర్వశిక్షా అభియాన్(ఎస్‌ఎస్‌ఏ), 9,10 తరగతులకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కొన్ని మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. వీటి అమలు బాధ్యతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అప్పగించింది.
 
 మార్గదర్శక సూత్రాలు ఇవే..
 సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ ఇన్‌చార్జి డెరైక్టర్ వి. ఉషారాణి ఈ ఏడాది జులైలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు పాఠశాల స్థాయి లేదా స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో ప్రధానోపాధ్యాయులే తయారు చేసి నిర్వహించుకోవాలని సూచించారు.
 
 ప్రశ్న పత్రాల ముద్రణ , నిర్వహణ కోసం ప్రతి విద్యార్థికి రూ. 2.50 చెల్లిస్తామని పేర్కొన్నారు. 9,10 విద్యార్థుల నుంచి పరీక్షకు 10 రూపాయల వంతున వసూలు చేయవచ్చని సూచించారు.
 
సీసీఈ (సమగ్ర నిరంతర మూల్యాంకనం) నిబంధనల ప్రకారం జిల్లా అంతటా ఏకీకృత పరీక్షలు ఉండరాదని అలా నిర్వహిస్తే ప్రధానోపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విధంగా విద్యా శాఖ కేటాయించిన పరీక్షల నిర్వహణ బాధ్యతలు జిల్లాలోని  ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కష్టంగా మారాయి.
 
 ప్రశ్న పత్రాల రూపకల్పన, వాటిని జిరాక్స్ తీయించి పరీక్షలు నిర్వహించటం ఆర్థికంగా భారమేనంటున్నారు. ప్రశ్న పత్రాల తయారీ ఇతర ఖర్చులకు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం రూ. 2.50 మాత్రమే కేటాయించటంతో మిగిలిన మొత్తాన్ని ప్రధానోపాధ్యాయులే భరించాల్సిన పరిస్థితి నెలకొంది.
 
 ఈ విధానంలో ఇప్పటి వరకు రెండు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక పరీక్షను అష్టకష్టాలు పడి నిర్వహించిన ప్రధానోపాధ్యాయులకు మిగిలిన పరీక్షల నిర్వహణ సవాల్‌గా మారింది. అర్ధ సంవత్సర పరీక్షలు ఈ నెల 15 నుంచి 22 వరకు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలకు నిధులు కూడా విడుదల చేయలేదు.
 
  అంతర్గత పరీక్షల నిర్వహణ సక్రమంగా కొనసాగకపోతే రానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని ప్రధానోపాధ్యాయులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
  నూతన సిలబస్, బోధనపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా పరీక్షల నిర్వహణపై ప్రయోగాలు చేయటం తగదని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
 
 విద్యా సంవత్సరం ఆరంభంలోనే నిధులు ఇవ్వాలి..
 విద్యా సంవత్సరం ఆరంభంలోనే పరీక్షల నిర్వహణకు సంబంధించిన నిధులు విడు దల చేయాలి. ప్రస్తుతం ఇస్తున్న నిధులను పెంచాలి. విద్యాపరమైన నిర్ణయాలు తీసు కొనే సమయంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి.
 - సీవీఎస్ మణి, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement