కలెక్టరేట్ లోపలి నుంచి మహిళ, కట్టె సాయంతో వస్తున్న అంధుడు శివ, పక్కన స్నేహితురాలు అంధురాలు గంగమ్మ
‘ప్రతి ఇంటిలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం.. ఉద్యోగం ఇవ్వని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తాం’ అని గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీలు ఇచ్చారు... ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారు.. ఎందుకంటే.. సాక్షాత్తు సీఎంకే ఓ వికలాంగుడు తన పరిస్థితి వివరించినా ఉద్యోగం రాలేదు.. తనకు ఉద్యోగం ఇచ్చి జీవనాధారం కల్పించాలని అతను వేడుకుంటున్నారు.
సాక్షి, కడప : అతన్ని చూడగానే ఎవరికైనా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే అతనికి పుట్టుక తర్వాత మూడు నెలలకే అమ్మవారు పోసి కనుచూపు దూరమైంది. మూడు నెలల క్రితం ప్రమాదం రూపంలో కాలిని దెబ్బతీసింది. కట్టె లేనిదే ముందుకు కదల్లేడు. మనిషి సాయం లేనిదే అడుగు వేయలేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అతన్ని చూసినా జాలి చూపిస్తారు. కానీ కడప కలెక్టరేట్ చుట్టూ 25 సార్లకు పైగా ప్రదక్షిణలు చేశాడు. పెద్ద దేవున్ని మొక్కితే న్యాయం జరుగుతుందని అమరావతి వెళ్లి సీఎంను కలిశాడు. అదిగో ఇదిగో అంటూ కాలాయాపన జరుగుతుందే తప్ప ఆ దివ్యాంగుడి వేదన ఆలకించేవారు కనిపించడం లేదు.
ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. రెండేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాడు పక్కీరుగాండ్ల శివ. కడప నగరంలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న పి.శివ అనే యువకుడు 2016 డిసెంబరులో బ్యాక్‌లాగ్ పోస్టుల కింద అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశాడు. తర్వాత 2017 మార్చి నుంచి పోస్టు కోసమై తిరుగుతూనే ఉన్నాడు. శివకు తల్లిదండ్రులు లేరు. అండగా నిలబడేవారు లేరు. బతుకు దెరువుకోసం కడప నెహ్రూ పార్కు సమీపంలోని ఆయుర్వేద సంస్థలో పని చేస్తూ నెలకు రూ. 5 వేలు సంపాదించుకునే వాడు. అయితే విధి వక్రీకరించడంతో మార్చి 9న ప్రమాదం జరగడం, కాలికి ఆరోగ్యశ్రీ కింద రాడ్డు వేసి ఆపరేషన్ చేశారు. దీంతో చిరుద్యోగం కూడా దూరం కావడంతో తీవ్ర వేదనతో అల్లాడిపోతున్నాడు.
ఉద్యోగం పక్కన పెడితే..సమాచారమూ కరువే..
శివ ఉద్యోగానికి దరఖాస్తు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు తిరుగుతూనే ఉన్నా.. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. శివకు తోడు మరో స్నేహితురాలైన అంధురాలు గంగమ్మను వెంట బెట్టుకుని కలెక్టరేట్‌కు వస్తున్నా.. అధికారులను కలుస్తున్నా ఎవరూ స్పష్టంగా సమాచారం ఇవ్వడం లేదు. ఇప్పటికే వికలాంగుల సంక్షేమ శాఖతోపాటు కలెక్టరేట్ కార్యాలయాలకు, మీకోసం కార్యక్రమానికి 25 సార్లకు పైగా తిరిగినా స్పందన లేదు. కనీసం ఉద్యోగం సంగతి పక్కన పెడితే.. దరఖాస్తుకు సంబంధించి ఏమైంది? అని చెప్పే నాథుడు కూడా లేడని ఆవేదన వ్యక్తం చేశాడు. బాలాజీనగర్ నుంచి ఆటోలో కలెక్టరేట్‌కు చేరుకోవడం.. అక్కడ ఎవరినో ఒకరిని అడుగుతూ కట్టె సాయంతో అధికారులను కలుస్తూ అగచాట్లు పడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో అతనితోపాటు మరో అంధురాలు కూర్చొని దరఖాస్తుకు సమాచారం తెలియక అవస్థలు పడుతున్న నేపథ్యంలో గమనించిన ‘సాక్షి’ ఏఓ వెంకటరమణ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించగా... దరఖాస్తు నంబరు, ఆధార్‌కార్డు ఆధారంగా పరిశీలించిన వారు ఉద్యోగ విషయంలో ఏమీ చెప్పలేదు. తర్వాత ఖాళీల భర్తీ సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
సీఎంకు విన్నవించినా..
ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా శివ అన్ని చోట్ల తిరుగుతూనే ఉన్నాడు. చివరకు అమరావతి వెళ్లి సీఎం చంద్రబాబును కూడా కలిసి ఉద్యోగ విషయమై గోడు వెళ్లబోసుకున్నాడు. తర్వాత కాలంలో కూడా ఇక్కడ రాత్రి బయలుదేరడం.. అక్కడ ఉదయాన్నే సీఎం కార్యాలయానికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో నాలుగు సార్లు పీఏలకు దరఖాస్తు ఫారాలు ఇచ్చి వచ్చామని ‘సాక్షి’కి వివరించారు. అయితే కలెక్టరేట్‌కు పంపిస్తామని.. అక్కడికి వెళితే న్యాయం చేస్తారని సీఎం ఆఫీసులో చెప్పడంతో ప్రతిసారి వెనక్కి వచ్చి ఇక్కడ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న అతను పూర్తిగా అంధుడు కావడంతో అడుగు కూడా పక్కకు వేయలేని పరిస్థితి నెలకొంది.
మానవతా దృక్పథంతో కలెక్టర్ కరుణిస్తే..
బ్యాక్‌లాగ్ పోస్టుల కోసం దరఖాస్తు చేసి రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్న శివకు మానవతా దృక్పథంతో ఏదో ఒక చోట.. కనీసం ఏదో ఒక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం అవకాశం కల్పిస్తే ఒక జీవితాన్ని నిలబెట్టినట్లు అవుతుంది. ఎందుకంటే అతనికి కనిపించక.. కాళ్లు సహకరించక పోయినా అధికారులపై నమ్మకంతో చాలా సార్లు అగచాట్లు పడుతున్నా.. తిరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో కలెక్టర్ కొంతైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఏదో ఒక ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే జీవనాధారం లేక అగచాట్లు పడుతున్న శివ పరిస్థితిని అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment