సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల గడువు సమీపించే కొద్ది రాజకీయ పార్టీల్లో సమీక్షలు, మంతనాలు సహజం. అయితే టీడీపీ అధిష్టానం ఈ సమీక్షల ఆధారంగా తమ పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే బెటర్ అన్న విషయంపై అంచనా వేస్తోంది. పేరుకు టీడీపీ సమన్వయ సమావేశంగా చెప్పుకుంటున్నా, తెరవెనుక ఎన్నికల వ్యూహమే కన్పిస్తోంది. సోమ, మంగళవారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలతో ప్రత్యేక భేటీ అందులోభాగమే. ఈ సమీక్ష కొందరికి మోదం కాగా, మరికొందరికి ఖేదంగా నిలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.
వైఎస్సార్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని భావిస్తే తిరోగమనం దిశగా పయనిస్తోంది. పార్టీ నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగప్రవేశం చేశారు. టీడీపీ నాయకులకు కాయకల్ప చికిత్స చేయదలిచారు. ఆమేరకు నియోజకవర్గ ఇన్‌చార్జిలతో రెండు రోజులుగా ప్రత్యేక సమావేశమయ్యారు. తొలుత ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, టీడీపీ పరిశీలకులు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణరెడ్డితో భేటీ అయ్యారు. తర్వాత జిల్లా నాయకులందరితో సమావేశమై పలు విషయాలు వెల్లడించారు. ఆపై నియోజకవర్గ ఇన్‌చార్జిలతో, ముఖ్య నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడారు. కడప, పులివెందుల నియోజకవర్గాల సమీక్ష చేపట్టలేదు. మైదుకూరులో పొరపొచ్చాలు లేకపోవడంతో మిగిలిన నియోజకవర్గాల నాయకులతో ముఖాముఖీ జరిపారు. ఈ సందర్భంగా కొందరు తీవ్ర అసంతృప్తికి గురి కాగా, మరికొందరు లోలోన సంతోషపడుతున్నట్లు సమాచారం. మంగళవారం బద్వేల్, ప్రొద్దుటూరు నాయకులతో చర్చలు కొనసాగించారు.
ఆనంద డోలికల్లో వీరశివా వర్గీయులు
సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డికే టీడీపీ టికెట్ అంటూ ఇటీవల మంత్రి ఆది ప్రకటన చేశారు. మంత్రికి ఘాటుగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి సైతం జవాబు చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే వీరశివాతో సీఎం దాదాపు 15 నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారని సమాచారం. నియోజకవర్గ రాజకీయాలపై కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో కలిసికట్టుగా పనిచేయాలని వెల్లడించినా ఒక్కొక్కరితో సీఎం మాట్లాడిన నేపథ్యంలో ఎవరికి ఎలాంటి హామీ లభించిందన్న విషయం బహిర్గతం కాలేదు. కాగా మంగళవారం కూడా వీరశివారెడ్డి విజయవాడలో తిష్టవేసి సీఎం చంద్రబాబు కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్పష్టమైన సంకేతాలు అందడంతోనే తమ నేత విజయవాడలో తిష్టవేశారని కొందరు బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనున్నట్లు వీరశివా వర్గీయులు పేర్కొంటుండటం గమనార్హం. కాగా కడప నేతల్ని సమీక్షకు ఆహ్వానించకపోవడంపై జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై గుర్రుగా ఉన్నారు. జిల్లాలో బలిజ, ముస్లిం సామాజిక వర్గాలను అధ్యక్షుడు వ్యూహాత్మకంగా వెనక్కు నెట్టేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి ఆదికి హితవు
ఎమ్మెల్సీ, జమ్మలమడుగు ఇన్‌చార్జి రామసుబ్బారెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఆరోపణల పర్వం కొనసాగించినట్లు సమాచారం. గతిలేక ఎమ్మెల్యే ఆది టీడీపీలో చేరితే మీరు ప్రోత్సహించి మంత్రిని చేశారు, ఆయనేమో చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరినట్లుగా ఫోజులు కొడుతున్నారని మండిపడ్డట్లు తెలుస్తోంది. పైగా మంత్రి హోదాను అడ్డుపెట్టుకొని మూడున్నర్ర దశాబ్దాలుగా టీడీపీలో ఉన్న కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వివరించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆవేదనను విన్న సీఎం ఆయనను శాంతింపజేసి, ఆపై మంత్రి ఆదిని నోరు అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషిచేయాలని ఆదేశించినట్లు టీడీపీ నేతలు వెల్లడించారు. అలాగే రాజ్యసభ సభ్యుడిని ఉద్దేశించి మీరు చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసం కాదని, సీనియర్ నాయకుడు అయి ఉండి సహనం లేకపోతే ఎలా, ఇలాగైతే ఉపేక్షించేది లేదంటూ సీఎం మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ముక్తియార్‌లు కూడా సమీక్షకు హాజరై ఇన్‌చార్జిగా వరద ఏకపక్ష చర్యలు చేపడుతున్నట్లు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
విజయమ్మకు అండగా ఆ నలుగురు...
బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు అండగా మంత్రులు ఆది, సోమిరెడ్డి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, పులివెందుల ఇన్‌చార్జి సతీష్‌రెడ్డి నిలిచారు. దివంగత బద్వేల్ వీరారెడ్డి టీడీపీకి చేసిన సేవల నేపథ్యంలో విజయమ్మకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు సూచించినట్లు తెలుస్తోంది. అంతకు మునుపు ఎమ్మెల్యే జయరాములు, పోటీచేసి ఓడిపోయిన విజయజ్యోతికి అండగా సీఎం వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ నలుగురు సర్దిచెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతిలతో విడివిడిగా సీఎం సమావేశమయ్యారు.
ఇద్దరు కూడా ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ తమకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, ప్రతి విషయంలో విజయమ్మ అడ్డుతగులుతున్నారని సీఎంకు విన్నవించినట్లు తెలుస్తోంది. జిల్లా నాయకులు సైతం ఆమెకే అండగా నిలుస్తున్నారని వాపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే జయరాములు, విజయజ్యోతి విషయంలో తొలుత సానుకూలంగా స్పందించిన సీఎం ఆ తర్వాత విజయమ్మతో కలిసి వెళ్లాలని అమె అండ లేకుండా ఎన్నికలు చేయడం కష్టమేకదా అన్నట్లు సమాచారం. జిల్లాలో ఇక నాయకులంతా కలిసికట్టుగా వ్యవహరించాలని చెప్పడంతో అందరూ తలాడించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment