జిల్లా రుణం తీర్చుకుంటా
♦ రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం
♦ హంద్రీ-నీవా పూర్తికి కృషి
♦ ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు
♦ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా పయ్యావుల కేశవ్
అనంతపురం అర్బన్ : ‘అనంత ప్రజల మనిషిగా జిల్లా రుణం తీర్చుకుంటా. రైతుల కన్నీళ్లు తుడవడమే ధ్యేయం. రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీ-నీవా పథకాన్ని పూర్తి చేయించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తా’నని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ అన్నారు. తన ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్ ఫారాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీలో సైనికునిలా పనిచేసిన తనకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్నారు.
ఇప్పుడు జిల్లా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. ముఖ్యమంత్రి పట్టిసీమకు ఎంత ప్రాధాన్యతిస్తున్నారో.. హంద్రీ-నీవాకూ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పారు. యువతకు ఉపాధి కల్పించే దిశగా కృషి చేస్తానన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ప్రతిక్షణం పాటుపడతానని పునరుద్ఘాటించారు.
కార్యకర్తల సంబరాలు : ఎమ్మెల్సీగా కేశవ్ డిక్లరేషన్ అందుకున్న సందర్భంగా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. కేశవ్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి అభినందలు తెలిపారు.