షబానాను విచారిస్తున్న సీఐ రమేష్
చిత్తూరు, మదనపల్లె క్రైం : ‘భర్తను భయపెట్టడానికే ఇంటి నుంచి పారిపోయాను. ఇప్పటికైనా మారి అనుమానించకపోతే కాపురం చేస్తా. లేదంటే అమ్మగారి ఇంటికి వెళ్లిపోతాను’ అని షబానా తెలిపింది. మదనపల్లె మండలం కొత్తపల్లె పంచాయతీ రంగారెడ్డి కాలనీలో ఉంటున్న ముస్తఫా భార్య షబానా ఆదివారం భర్త వేధింపులు తాళలేక బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాట్సాప్‌లో మదనపల్లె మోతీనగర్‌లో ఉంటున్న తల్లి దిల్‌షాద్‌కు మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో మదనపల్లె రూరల్ పోలీసులు తల్లీబిడ్డల అదశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో షబానా సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
అదృశ్యం కావడానికి గల కారణాలను రూరల్ సీఐ రమేష్‌కు వివరించింది. తన భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. అనుమానంతో తనను వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఈ బాధలు భరించలేక భర్తను భయపెట్టేందుకు బిడ్డలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలిపింది. పత్రికల్లో కథనాలు రావడంతో పోలీసు స్టేషన్‌కు వచ్చినట్టు వివరించింది. అదృశ్యమైన మహిళ, ఆమె పిల్లలు రూరల్ పోలీసు స్టేషన్‌కు రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment