తహసీల్దార్‌పై మండిపడుతున్న గ్రామస్తులు
చంద్రగిరి: తరతరాలుగా వస్తున్న భూమిని ఆక్రమించుకోవడంతో పాటు దళితులపై గ్రామస్తుడు ఎల్లప్ప రెడ్డి దౌర్జన్యానికి యత్నించండంతో పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. అధికారులు కూడా దయ చూపకపోవడంతో ఇక చేసేదేమి లేక బాధితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి మండల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు.. చంద్రగిరి మండలం అగరాలకు చెందిన పొదిలి చిన్నయ్య అతని తమ్ముళ్లకు అగరాల లెక్క దాఖలా ప్రకారం సర్వే నంబరు 285లో 24 సెంట్ల భూమికి తాత ముత్తాల నుంచి ఉంది. ఇటీవల పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను వారు కోల్పోయారు. బాధితులు వారి సొంత భూమిలో ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. ఇదే గ్రామంలో అగ్రకులానికి చెందిన తూకాకుల ఎల్లప్ప రెడ్డి బినామీ పేర్లతో నకిలీ పత్రాలను సృష్టించి, వారి భూమిని కాజేసేందుకు కుట్రపన్నాడు. ఇంటి నిర్మాణానికి వచ్చిన బాధితులను అడ్డుకుని దౌర్జాన్యానికి పాల్పడ్డాడు.
పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు..
ఎల్లప్ప రెడ్డి దౌర్జన్యాన్ని తట్టుకోలేక పొదిలి చిన్నయ్య అతని కుటుంబ సభ్యులు 20 రోజుల క్రితం చంద్రగిరి పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎల్లప్ప రెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడితో పాటు దళిత గ్రామస్తులు నిరవధికంగా దీక్షకు దిగారు.
కనికరించని అధికారులు..
రెండు రోజులుగా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్నా అధికారులు దళితులపై కరుణ చూపలేదు. శుక్రవారం రాత్రి బాధితులకు తహసీల్దార్ న్యాయం చేయకపోవడంతో చిన్నయ్య తమ్ముడు కుమారుడు మునిశేఖర్ తహసీల్దార్ కార్యాయంలో ఆయన ఎదుటే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న గ్రామస్తులు మునిశేఖర్‌ను అడ్డుకుని, ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. అనంతరం గ్రామస్తులంతా తహసీల్దార్ ఎదుట బైఠాయించారు.
జేసీ హామీతో ఆందోళన విరమణ..
ఉన్నతాధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న జేసీ గిరిషా తక్షణమే స్పందించారు. బాధితుడికి జరిగిన అన్యాయంపై విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం చేస్తానని ఆయన ఫోన్లో హామీ ఇచ్చారు. జేసీ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment