
అత్తింటి వారే హత్యచేశారు..!
తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారని పట్టణంలోని గాంధీనగర్‌లో బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్యహరిణి ....
► పెళ్లయిన నాలుగునెలలకే నూరేళ్లు నిండాయి
► అదనపు కట్నం కోసం వేధించారు
► నమ్మకంగా తీసుకువెళ్లి మాత్రలు మింగించి చంపారు
► పోలీసులకు మృతురాలి తల్లి ఫిర్యాదు
తెనాలిరూరల్ : తమ కుమార్తెను అత్తింటి వారే హత్య చేశారని పట్టణంలోని గాంధీనగర్‌లో బుధవారం రాత్రి హత్యకు గురైన దివ్యహరిణి తల్లి వరలక్ష్మి ఆరోపించారు. పెళ్లయిన నాలుగునెలలకే పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన దంపతులు రామిశెట్టి గోపాలరావు, వరలక్ష్మి దంపతుల కుమార్తె దివ్యహరిణి(19)కి పట్టణానికి చెందిన పర్చూరి వంశీకృష్ణకు గత డిసెంబర్ 24న వివాహమైంది. కులాలు వేరైనా, మ్యారేజ్ బ్యూరో ద్వారా సంబంధం కుదిరింది. రూ.మూడు లక్షల నగదు, ఆరు తులాల బంగారం కట్నం కింద ఇచ్చినట్టు దివ్య హరిణి బంధువులు చెబుతున్నారు.
కోటి ఆశలతో అత్తింటికి వచ్చిన దివ్యకు వారం రోజుల్లోనే కష్టాలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మరో రూ.నాలుగు లక్షలు కట్నం కింద తీసుకురావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. ఈ నాలుగు నెలల కాలంలోనే దివ్యహరిణి పలుమార్లు పుట్టింటికి వెళ్లగా, పెద్దలు రాజీ కుదిర్చి పంపారు. వారం రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిన దివ్యహరిణిని భర్త వంశీకృష్ణ, అతని బావ రవిచంద్ర బుధవారం సాయంత్రం విజయవాడకు వెళ్లి తిరిగి ఇక్కడకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి ఆమె ఇంట్లో మృతి చెంది పడి ఉంది. భర్త, అతని కుటుంబ సభ్యులు కలసి తనతో ఏవో మాత్రలు మింగించారని బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో తమకు ఫోను చేసి చెప్పిందని, తాము వచ్చేసరికి మృతి చెంది ఉందని మృతురాలి తల్లి వరలక్షి తెలిపారు.
తమ కుమార్తెను భర్త, అత్త లక్ష్మి, మామ రఘురామయ్య, ఆడపడుచు కొర్రపాటి సుధారాణి, ఆమె భర్త కొర్రపాటి రవిచంద్ర కలసి హత్య చేశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఓఎస్‌డీ ఎస్.ఆర్.వెంకటేశ్వరనాయక్, టూటౌన్, తాలూకా సీఐలు బి.కళ్యాణ్‌రాజు, యు. రవిచంద్ర పరిశీలించారు. ఆర్‌ఐ సూర్యనారాయణమూర్తి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.