నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి
కొరిటెపాడు (గుంటూరు) : నకిలీ విత్తనాల విక్రయ దుకాణాలు, కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వంలో మార్కెట్‌లో నకిలీ విత్తనాలు వుండటానికి వీలులేదన్నారు. గుంటూరులోని కాటన్ అసోసియేషన్‌లో శనివారం ఆయన ఎ.పి కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై రైతులు తీసుకోవాల్సిన చర్యలుపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు వేసి రైతులు నష్టపోరాదని, సర్టిఫై చేసిన, బ్రాండెడ్ కంపెనీలకు చెందిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, విజిలెన్స్ అధికారులు నకిలీ విత్తనాలను మాత్రమే సీజ్ చేయాలని, టెక్నికల్‌గా సమస్య వున్న విత్తనాలను సీజ్ చేయరాద న్నారు. అలా చేస్తే విత్తన సమస్య వస్తుందని తెలిపారు. లెసైన్సు లేకుండా అనధికారికంగా విక్రయించే విత్తన షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎంఆర్‌పి కన్నా ఎక్కువ ధరకు విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీఐ ప్రత్తి కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ, విజిలెన్స్ అధికారుల నుంచి నివేదికరాగానే చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రాష్ట్రంలో రెండు లక్షల బోర్లు వేసి 10 లక్షల ఎకరాలను అధనంగా సాగులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఎ.పి. కాటన్ అసోసిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందిమళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ విత్తన కొనుగోళ్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై 3 లక్షల కరపత్రాలను ముద్రించామని, వీటిని 13 జిల్లాల్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి రామారావు, సభ్యులు పాల్గొన్నారు.