'జైరాం రమేష్ నోరు అదుపులో పెట్టుకో'
హైదరాబాద్ : కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్- టీఆర్ఎస్ మధ్య సయోధ్య దెబ్బతీసేలా జైరామ్ రమేశ్ చర్యలున్నాయని ఆయన మంగళవారమిక్కడ విమర్శించారు. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులు తెలియకుండా జైరాం మిడిమిడిజ్ఞానంతో మాట్లాడుతున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నట్టు అనుమానంగా ఉందని హరీష్ ఆరోపించారు. టీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడుతున్న జైరామ్ రమేష్‌ను ఇక చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని జైరాంకు సూచించారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోతే టీఆర్ఎస్కు వచ్చే నష్టమేమి లేదని హరీష్ రావు అన్నారు. ఏపీ భవన్‌ను తెలంగాణకు దక్కకుండా జైరాం కుట్రలు చేశారని వ్యాఖ్యలు చేశారు. పైకి మాత్రం చర్చలు అంటూ జైరాం నాటకాలు ఆడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు.