విలేకరులతో మాట్లాడుతున్న జైరాం రమేశ్. చిత్రంలో భట్టి, ఉత్తమ్
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రాన్ని ఓ ప్రైవేటు కంపెనీలాగా హైదరాబాద్‌లో ఎనిమిదో నిజాం పాలిస్తుంటే... పెద్ద నోట్ల రద్దు లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ ఢిల్లీలో సుల్తాన్‌బిన్ తుగ్లక్ పాలిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ దుయ్యబట్టారు. గురువారం మక్తల్ మండలంలోని బొందలకుంట వద్ద భారత్‌జోడో యాత్ర విరామం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, బలరాం నాయక్, జెట్టి కుసుమకుమార్, గాలి అనిల్‌కుమార్, అయోధ్యరెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు.
దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ పంథాలోనే టీఆర్‌ఎస్, ఎంఐఎంలు కూడా వెళ్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీలు బీజేపీకి ఆక్సిజన్ ఇస్తే అప్పుడప్పుడూ బీజేపీ ఆ పార్టీలకు బూస్టర్‌డోస్ ఇస్తుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తమకు రెండు కళ్లే ఉన్నా టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంల రూపంలో మూడు లక్ష్యా లున్నాయని చెప్పారు. అయితే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో మాత్రం తమకు, టీఆర్ ఎస్‌కు మధ్యనే పోటీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ లేకుండానే దేశంలోని ప్రతి పక్షాలను ఏకం చేస్తామంటూ కొందరు కలలు కంటున్నారని... అవి కలలుగానే మిగిలిపోతాయని జైరాం ఎద్దేవా చేశారు. బలమైన కాంగ్రెస్ పార్టీ లేకుండా దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదని చెప్పారు.
యాత్రకు మంచి స్పందన..
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, రాహుల్ యాత్ర పూర్తయ్యాక దేశంలో కొత్త కాంగ్రెస్ కనిపిస్తుందని జైరాం రమేశ్ చెప్పారు. యాత్ర ఫలితాలు ఓట్ల రూపంలోనూ లబ్ధి చేకూరుస్తాయని శిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై జైరాం స్పందిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వన్ పార్టీ–వన్ మ్యాన్ రూల్ నడుస్తోందని జైరాం విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment