గుండె ఆపరేషన్ చేసిన నవజాత శిశువుతో వైద్యుడు రామారావు, విక్రమ్, దిలీప్ తదితరులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): టోటల్ ఎనామీలస్ పల్మనరీ వీనస్ రిటర్న్ అనే అత్యంత క్లిష్టమైన గుండె సమస్యతో జన్మించిన శిశువుకు ఆంధ్రా హాస్పటల్ వైద్యులు ఆయుష్షు పోశారు. 18 రోజుల వయస్సులోనే క్లిష్టతరమైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించడంతో ప్రస్తుతం ఆ శిశువు కోలుకుని ఆరోగ్యంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. ఈ సందర్బంగా బుధవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు వివరాలు వెల్లడించారు.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన సుమతిరాణి, సురేష్‌బాబులకు ఏప్రిల్ 20న శిశువు జన్మించగా, చికిత్స నిమిత్తం ఆంధ్రా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇక్కడి వైద్యులు శిశువును పరీక్షించి గుండెలోపలికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు ఎడమచేతి పక్కన కాకుండా, గుండెలోపల కరోనరీ సైనస్ అనే చోట చేరడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ శిశువుకు ఈ నెల 3న విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించామని తెలిపారు. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దిలీప్ మాట్లాడుతూ ఈ శిశువుకు క్లిష్టతరమైన సమస్య కావడంతో ఛాలెంజ్‌గా తీసుకుని చేశామన్నారు. పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుడుముల విక్రమ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె.శ్రీమన్నారాయణ, కార్డియాక్ అనస్థీషియా డాక్టర్ రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment