
నడుస్తున్న రైళ్లు.. ఏటీఎంల వద్ద భారీ క్యూలు
ఎట్టకేలకు ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి క్రమంగా వస్తోంది. బయ్యారం - ఎలమంచిలి మధ్య రైల్వే బ్రిడ్జిని పునరుద్ధరించారు. రెండు ట్రాకులు అందుబాటులోకి వస్తాయి. దాంతో విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రాంతాలకు బుధవారం సాయంత్రం నుంచి పూర్తిస్థాయిలో రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దాదాపు నాలుగు రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిషాకు కూడా రవాణా మార్గాలు పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పనిచేసి, రైలు మార్గాలను పునరుద్ధరించారు.
మరోవైపు.. కొన్ని ఏటీఎం కేంద్రాలు కూడా ఇప్పుడిప్పుడే పనిచేయడం ప్రారంభించాయి. దాంతో డబ్బులు తీసుకోడానికి వాటి ముందు భారీ క్యూలలో ప్రజలు వేచిచూస్తున్నారు. వృద్ధులు, మహిళలు కూడా ఈ క్యూలలో వేచి చూస్తూ ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల తర్వాత వీటిలో రెండు మూడు కేంద్రాలు పనిచేస్తుండటంతో చాలామంది డబ్బుల కోసం ఏటీఎం కేంద్రాలకు వెళ్లారు. తుఫాను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి వద్దా ఇళ్లలో పెద్దగా డబ్బులు లేకపోవడం, ఏటీఎంలలో ఇన్వర్టర్లు విద్యుత్ సరఫరా లేక ఛార్జింగ్ అయిపోయి అవి పనిచేయడం మానేశాయి. అసలే ఒకవైపు ధరలు ఆకాశాన్ని అంటుతుండటం, మరోవైపు డబ్బు లేకపోవడంతో విశాఖ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు వాళ్ల కష్టాలు కొంతవరకు తీరే అవకాశం కనిపిస్తోంది.