ఉల్లి కోసం ఆగని పోరాటం
చిత్తూరు: ఉల్లి గడ్డల కోసం జనం సాగిస్తున్న పోరాటాలను అడ్డుకోలేక పోలీసులు చేష్టలుడిగి చూస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు నగరంలోని రైతు బజార్‌లో ఏర్పాటు చేసిన రూ.20 కే కిలో ఉల్లి విక్రయకేంద్రం వద్ద పరిస్థితే ఇందుకు నిదర్శనం. బుధవారం ఉదయం 5 గంటలకే రైతు బజార్ కు జనం క్యూకట్టారు.
దాదాపు 1700 మంది తరలిరాగా తోపులాట మొదలైంది. కానీ, బందోబస్తు కోసం అక్కడ నలుగురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. వారు అంతమంది జనాన్ని అదుపులోకి తేలేక చేతులెత్తేశారు. ఉదయం 8.30 గంటలకు జనం తోపులాటలు, అరుపులు కేకలతో రైతు బజార్ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది.
అదేవిధంగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని రూ.20 కే కిలో ఉల్లి విక్రయ కేంద్రాల వద్ద రద్దీ తగ్గలేదు. నగరంలోని 8 విక్రయ కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచే క్యూలు మొదలయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.70 వరకు పలుకుతుండటంతో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారిని నియంత్రించేందుకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.