
భారీ భద్రత
{sాఫిక్ నియంత్రణకు తొలి ప్రాధాన్యం
125 సీసీ కెమెరాలతో అణువణువూ నిఘా
అసాంఘిక శక్తుల నియంత్రణకు
{పత్యేక బృందాలు ఘాట్ రోడ్డులో భక్తులు అప్రమత్తంగా ఉండాలి
‘సాక్షి’తో ఎస్పీ ఆకె రవికృష్ణ
సాక్షి, కర్నూలు : ‘శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు భద్రత పరంగా ఎటువంటి ఢోకా లేదు. 2,393 మంది సిబ్బంది, వందలాది సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులు, దొంగల నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. ఆత్మకూరు, డోర్నాల ఘాట్‌రోడ్డులో ప్రయాణించే భక్తులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి’ అంటున్న జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ.. తాత్కాలికంగా రథోత్సవం వరకు అక్కడే బస చేసి బ్రహ్మోత్సవాలను పర్యవేక్షిస్తాన్నంటున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీగిరిపై చేపట్టిన పలు భద్రత చర్యలపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే...
భక్తులకు అసౌకర్యం కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం. అసాంఘిక శక్తులపైన డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక నిఘా బృందాలను పెట్టాం. నిఘా వర్గాలతో తనిఖీ నిర్వహించి శ్రీశైలం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. క్యూలైన్లు, పాతాళగంగ, ఘాట్‌రోడ్డులో ప్రయాణికుల భద్రతపైనా జాగ్రత్తలు తీసుకున్నాం. 125 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. బందోబస్తు కోసం ఇద్దరు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, 126 మంది ఎస్‌ఐలు, ఇద్దరు ఏఆర్ ఎస్‌ఐలు, 403 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 1127 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, ఏఆర్ సిబ్బంది 25 సెక్షన్లు, 550 మంది హోంగార్డులు, 14 స్పెషల్‌పార్టీ బృందాలతోపాటు కడప జిల్లా నుంచి మరో 450 పోలీసులను ఉపయోగిస్తున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఈ ఏడాది పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. సూచికలు ఏర్పాటు చేశాం. క్యూలైన్లలో రద్దీ వల్ల తొక్కిసలాట లేకుండా పర్యవేక్షిస్తున్నాం. తలుపుల వద్ద మెటల్ డిటెక్టర్ ద్వారా భక్తులకు తనిఖీలు చేసి ఆలయం లోపలకు అనుమతిస్తున్నాం.
దొంగతనాలు, నేరాలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, క్రైమ్‌పార్టీలు తిరుగుతున్నాయి. అనుమానస్పద వ్యక్తుల కదిలికలపైన నిఘా పెట్టాం. ఘాట్‌రోడ్డులో ప్రయాణించే భక్తులు రోడ్డుకు ఒకవైపునే ప్రయాణించాలి. రహదారుల మధ్యన హాకర్స్ వ్యాపారాల పేరుతో రోడ్లను ఆక్రమిస్తే సహించేది లేదు. పాతాళ గంగ నుంచి నందిమండపం వరకు, నందిమండపం నుంచి ఆలయం ప్రధాన ద్వారం, దేవస్థానం చుట్టుపక్కల ఉండే అన్ని ముఖ్య రహదారుల్లో హాకర్లు లేకుండా చేస్తాం. వ్యాపారులు అనుమతి ఉన్నచోటే విక్రయాలు చేసుకోవాలి. భక్తులకు అసౌకర్యంగా ఉన్నా.. రోడ్ల మీద వ్యాపారులు నిర్వహించినా సహించేది లేదు. శివదీక్ష శిబిరాలు, ప్రధాన రహదారులు, పాతాళగంగ, దేవస్థానంలో లోపల భక్తుల కదికలపైన నిఘా ఉంచాం. కంట్రోల్‌రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం.
రథోత్సవం పూర్తి అయ్యే వరకు శ్రీశైలంలోనే బసచేసి, రక్షణ, ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తాను. రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా రెండు ప్రత్యేక క్రేన్లను వినియోగిస్తున్నాం. నిత్యం ద్విచక్ర వాహనాల్లో పెట్రోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా మహానంది, యాగంటి, ఓంకారం, బ్రహ్మగుండం, పాత బుగ్గ, జగన్నాథ గట్టు, కాల్వబుగ్గ తదితర పుణ్యక్షేత్రాలలో కూడా అవసరమైన పోలీసు బందోబస్తు చర్యలు చేపట్టాం. శివరాత్రి సందర్భంగా దేవస్థానానికి వచ్చే భక్తులు, విలేకరులు, ఫొటో, వీడియో గ్రాఫర్ల పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించాలి.