వరద బాధితులకు సాయం | Help for flood victims | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు సాయం

Published Sat, Nov 2 2013 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM

Help for flood victims

 

=జలాశయాల ఆధునికీకరణ
 =రైతులకు పెద్ద ఎత్తున రుణాలు
 =రచ్చబండ దరఖాస్తుదారులకు రేషన్‌కార్డులు
 =రాష్ట్రావతరణ దినోత్సవంలో కలెక్టర్ ఆరోఖ్యరాజ్  

 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పె-లీన్, భారీ వర్షాలకు నష్టపోయిన వారికి సాయమందేలా కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపట్రానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి చేపట్టిన, చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఇటీవల  వరదలు కారణంగా ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లందన్నారు. ప్రభుత్వ పరంగా అందించిన సాయాన్ని తప్పకుండా బాధితులందరికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ భారీ వర్షాలలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా కృషి చేసిన అధికార యంత్రాంగానికి, ఇతర స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు.

జలయజ్ఞం కార్యక్రమం కింద జలాశయాల ఆధునికీకరణలో భాగంగా రూ.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాండవ జలాశయ పనులను 2014 జూన్ నాటికి, అలాగే 10.8 కోట్లతో కోణాం పనులను 2014 మార్చి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ చెప్పారు. రైవాడ పనులలో 27 శాతం రూ.5.5 కోట్లను వెచ్చించి పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వాటిని రూ.43.25 కోట్లు అంచనా వ్యయంతో చేపట్టేందుకు ప్రతిపాదించినట్లు వివరించారు.

రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ జిల్లాలో పెద్ద ఎత్తున పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు, ఆధునిక యంత్ర పరికరాలు పంపిణీ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రూ.640 కోట్ల మేర పంట రుణాలను 1.45 లక్షల మంది రైతులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు. నీలం తుపాను వల్ల నష్టపోయిన 1.48 లక్షల మంది రైతులకు నష్టపరిహారంగా మంజూరైన రూ.30.41 కోట్లు పంపిణీ జరుగుతోందన్నారు. గత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం స్వీకరించిన 1,23,044 దరఖాస్తులను పరిశీలించగా, అందులో 1,09,595 దరఖాస్తులను అర్హులుగా గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఇంకా కార్డులు పొందలేని కుటుంబాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వీటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

 వివిధ పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిమ్మాపురంవిజ్ఞాన్ హైస్కూల్, మధురవాడ విజయం హైస్కూల్, చైతన్య రెడ్నం గార్డెన్ హైస్కూల్, ఎండాడ మండల పరిషత్ ఉన్నత పాఠశాల , జ్ఞానాపురం సెక్రెడ్ హార్ట్ హైస్కూల్, డాబాగార్డెన్స్‌లో ఉన్న ఎంజీఎం హైస్కూల్ విద్యార్థులు తెలుగుజాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గీతాలకు నృత్యాలు చేశారు. అనంతరం విద్యార్థులకు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, సీపీ మహీధర్‌రెడ్డి, ఎస్పీ దుగ్గల్‌లు జ్ఞాపికలు అందజేశారు.
 
గిరిజనాభివృద్ధికి కృషి

పాడేరు ఏజెన్సీ పరిధిలో గిరిజనుల సంక్షేమం,అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. సమగ్ర  కార్యాచరణ ప్రణాళిక కింద గతేడాది జిల్లాకు మంజూరైన రూ.30 కోట్లతో చేపట్టిన పనులు ప్రగతిలో ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది మంజూరు చేసిన మరో రూ.30.65 కోట్లతో కనీస మౌలిక వసతులైన రోడ్లు, బ్రిడ్జ్‌లు, కల్వర్టులు, పాఠశాలలకు అదనపు భవనాలు, తాగునీటి వనరుల అభివృద్ధికి అనేక నిర్మాణ పనులకు పరిపాలనా ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. అరకులో కో-ఎడ్యుకేషన్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను, కొయ్యూరు మండలం మర్రిపాలెంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఏజెన్సీలో 1.35 లక్షల కాఫీ తోటల పెంపకం ద్వారా 1.31 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధిపొందుతున్నారని వెల్లడించారు.
 
 పేదలకు గృహ వసతి

 రచ్చబండ, ఇందిరమ్మబాట కార్యక్రమాల్లో దరఖాస్తుదారుల్లో ఎంపికయిన 3.55 లక్షల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 2.63 లక్షల మందికి  పక్కా ఇళ్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు జీవీఎంసీ పరిధిలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రూ.177 కోట్లు వెచ్చించి 9 వేల గృహాలను నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు. డయల్ యువర్ కలెక్టర్, ప్రజావాణి, డయల్ యువర్ ఆఫీసర్ కార్యక్రమాలకు అధికారులు హాజరై ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో శ్రమిస్తున్నట్లు చెప్పారు.
 
ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆరు శాఖలకు చెందిన స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. 900 యూనిట్లకు సంబంధించి 8750 మంది లబ్ధిదారులకు రూ.10.07 కోట్లను జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ పంపిణీ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement