ఏపీ ఎన్జీవోల సమ్మెపై విచారణ 2వ తేదీకి వాయిదా
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోల సమ్మెను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా పడింది. పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ఎన్జీవోలు శుక్రవారం వరకూ గడువు కోరటంతో న్యాయస్థానం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
ప్రతి పౌరుడూ తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని హితవు పలికిన హైకోర్టు, గడువులోగా కౌంటర్ దాఖలు చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఎపి ఎన్జీవోలకు హెచ్చరిక చేసింది. రాజకీయాలతో తమకు సంబంధం లేదని, ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధుడై ఉండాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. సమ్మె చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేదానినే పరిశీలనలోకి తీసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని కోర్టు సూచించింది.
మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాకుండా పిటిషన్‌పై విచారణ చేయడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. పార్టీలు తీసుకున్న నిర్ణయాలకు కోర్టు స్పందించదని వ్యాఖ్యానించింది.