హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం | High Court in the name of job fraud | Sakshi
Sakshi News home page

హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం

Published Sun, Aug 10 2014 2:29 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం - Sakshi

హైకోర్టులో ఉద్యోగాల పేరిట మోసం

  • రూ. కోటి వరకు వసూలు
  •  ఇద్దరి అరెస్టు
  • విశాఖపట్నం : హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి పరారైన ఇద్దరిని పరవాడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో శనివారం సీఐ రమణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజెర్ల గ్రామానికి చెందిన సయ్యద్ బాసిద్ ఆలీ 2003లో హైకోర్టులో తాత్కాలిక అటెండర్‌గా చేరి 2013లో మానేశాడు. అప్పటి నుంచి కారులో తిరుగుతూ న్యాయమూర్తిగా అందరికీ పరిచయం చేసుకుంటూ ఉండేవాడు.

    కత్తిపూడికి చెందిన సత్యనారాయణ, తుని డ్రైవర్స్ కాలనీకి చెందిన రాజేశ్వరితో కలిసి మోసాలకు పాల్పడేవాడు. వీరు హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని వరంగల్, అదిలాబాద్, తూర్చు గోదావరి, తుని, విశాఖ జిల్లాలో నర్సీపట్నం, రావికమతం, పరవాడ, రాం బిల్లి, అగనంపూడి, మాకవరపాలెం, పెదగంట్యాడ ప్రాంతాలకు చెందిన అనేక మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ. కోటి వసూలు చేశారు.

    ఒక్కొక్కరి వద్ద రూ.3 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు వసూలు చేసేవా రు. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చి హైదరాబాద్‌లో ఉద్యోగం చేరాలని వారు సూచించారు. తీరా అక్కడ వెళ్లాక మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమన్నారు.  అప్పటి నుంచి నిరుద్యోగులకు చిక్కకుండా రోజుకొక ప్రాంతానికి మకాం మార్చేసేవారు.

    ఈ నేపథ్యంలో బాధితులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు శనివారం నిందితులను తుని డ్రైవర్స్ కాలనీలో పట్టుకున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన 28 మంది మోసపోయినట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. ఇంకా వస్తూనే ఉన్నాయని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐ ఎన్.గణేష్, హెచ్‌సీ ఎం.ఉమా మహేశ్వరరావు, బి.లక్ష్మి పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement