శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, లీక్‌లపై హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ జరిపించాలని డీఎస్సీ ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్సీ జిల్లా ఐక్యవేదిక అధ్యక్షుడు పంచాది రాంబాబు మాట్లాడుతూ జిల్లాలో సంచలనం సృష్టించిన పేపర్ లికేజీ, సాయంత్రం వేళ చీకట్లో పరీక్ష నిర్వహించడం వంటి అంశాలపై కొద్దిరోజులుగా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. అయినా ప్రభుత్వం స్పదించలేదని, విచారణ చేపట్టకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణం హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, అంతవరకు జిల్లా డీఎస్సీ ఫలితాలు నిలుపుదల చేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకాడమని హెచ్చరించారు. ఆప్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఐ.జయదేవ్ మాట్లాడుతూ డీఎస్సీ పేపర్ లీక్‌లో అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల అండదండలతోనే అధికారులు బరి తెగించారని ఆరోపించారు. ఈ విషయంలో పాత్రదారులు, సూత్రదారులు ఎవరో ప్రజలకు తెలియాలంటే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అనివార్యమన్నారు. ధర్నా కార్యక్రమంలో డీటీఎఫ్ అధ్యక్షుడు కె.అప్పలరాజు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చౌదరి రవీంద్ర, ఏపీయూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.గిరిధర్, ఐఎఫ్‌టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ. నీలంరాజు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీనరసింహాన్ని కలిసి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
డీఎస్సీలో అక్రమాలపై హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ
Published Tue, May 19 2015 3:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement