గ్యాస్ సరఫరాకు ఆధార్ లింకొద్దు: హైకోర్టు
గ్యాస్ సరఫరాకు ఆధార్ కార్డులతో లింకు పెట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వినియోగదారులను ఇబ్బంది పెట్టొద్దని, ఆధార్ కార్డులతో సంబంధం లేకుండానే గ్యాస్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆధార్ కార్డుల కోసం ఒత్తిడి చేయడం సరికాదని, వినియోగదారులకు ఆ కార్డులు లేకపోయినా కూడా గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ పేరుతో ఆధార్ కార్డులను గ్యాస్ సరఫరాకు లింకు చేసిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పథకం పుణ్యమాని వినియోగదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. సిలిండర్ కొన్న ధరకు, సబ్సిడీ సిలిండర్ ధరకు ఉన్న వ్యత్యాసం మొత్తం బ్యాంకు ఖాతాల్లోకి జమకాకపోవడం, దీనిపై ఎవరిని అడగాలో కూడా తెలియకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కొంతవరకు ఊరట కలిగించింది.