ఏ నిబంధన మేరకు ఉత్తర్వులిచ్చారు?
• ఆధార్ కార్డు విషయంలో
• పోలీసుల ఉత్తర్వులపై హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: వాహనదారులు వాహనం నడిపే సమయంలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను వివరణ కోరింది. ఏ చట్ట నిబంధనలను అనుసరించి ఈ ఉత్తర్వులు జారీ చేశారో చెప్పాలని పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అం బటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన వై.సోమరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఆధార్ కోసం పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఆధార్ తప్పనిసరి కాదని నివేదించారు. హోంశాఖ తరఫు న్యాయవాది హెచ్.వేణుగోపాల్ స్పందిస్తూ.. ఆధార్ దగ్గర ఉంచుకోవాలన్నది సలహా మాత్రమేనన్నారు. డ్రైవింగ్ లెసైన్స్ లేకపోతే ఆధార్ ద్వారా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకే కమిషనర్ పత్రికా ప్రకటన ఇచ్చారన్నారు. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించింది.