
సాక్షి, హైదరాబాద్: కోర్టు ముందు స్వయంగా హాజరు కావాలంటూ తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వి.కె.యాదవ్‌కు ఉమ్మడి హైకోర్టు శుక్రవారం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ వారంట్ అమలుకు చర్యలు తీసుకుని, ఈ నెల 25న యాదవ్ కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సురేశ్ కెయిత్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన తండ్రి మరణించిన నేపథ్యంలో ఆయన కుమారుడిగా తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రతాప్ అనే వ్యక్తి రైల్వే అధికారులను కోరారు.
రెండో భార్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వరాదన్న సర్క్యులర్‌ను కారణంగా చూపుతూ ఉద్యోగం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ప్రతాప్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, రెండో భార్య కుమారుడు కారుణ్య నియామకానికి అర్హుడు కాదన్న రైల్వేశాఖ సర్క్యులర్‌ను బాంబే, కలకత్తా హైకోర్టులు కొట్టేశాయని, ఆ తీర్పులపై రైల్వే అధికారులు అప్పీళ్లు దాఖలు చేయలేదన్నారు. వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రతాప్‌కు ఉద్యోగం ఇచ్చే విషయంలో 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ గత జూలైలో ఉత్తర్వులిచ్చింది.
వీటిని అమలు చేయకపోవడంతో ప్రతాప్ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం 20న కోర్టు ముందు హాజరు కావాలని వి.కె.యాదవ్‌ను ఆదేశించింది. శుక్రవారం ఆయన కోర్టు ముందు హాజరు కాకుండా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దక్షిణ మధ్య రైల్వే సీనియర్ డివిజినల్ పర్సనల్ ఆఫీసర్ జె.బలరామయ్య వ్యక్తిగత హాజరుకు సైతం ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment