
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటన పౌర విమానయాన భద్రత చట్టం పరిధిలోకి వస్తున్నప్పుడు, ఆ ఘటన సమాచారాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చట్ట నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి తప్పనిసరి గా పంపాల్సి ఉన్నా, ఎందుకు పంపలేదని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, దీనికి సమాధానం చెప్పి తీరాల ని ప్రభుత్వానికి సోమవారం స్పష్టం చేసింది. జాతీయ భద్రత చట్టం కింద ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంది. విమానాశ్రయంలో చట్ట వ్యతిరేక ఘటనలు జరిగినప్పుడు ఈ చట్టం కింద ఏం చర్యలు తీసుకోవచ్చో తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన హత్యాయత్నం ఘటనపై దర్యాప్తును పక్కదారి పట్టించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ మాట్లాడిన నేపథ్యంలో, ఈ కేసు దర్యాప్తును స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమ యంలో ఆయన ఓ అదనపు అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం ఘట న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ నిర్వచన పరిధిలోకి వస్తుందని, పౌర విమానయాన భద్రత చట్ట నిబంధనల ప్రకారం ఇటువంటి ఘటనలపై ద ర్యాప్తు చేసే అధికారం ఎన్‌ఐఏకు ఉందని, అందువల్ల సమగ్ర దర్యాప్తు జరిపేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఇదే అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పిల్ దాఖలు చేసి న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఎన్‌ఐఏ దర్యాప్తు జరపొచ్చు...
ఈ సందర్భంగా వైఎస్ జగన్ తరఫు సీనియర్ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ‘పౌర విమానయాన భద్రతకు నష్టం కలిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలను నిరోధించేందుకు 1982లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్ 3, 3ఏ ప్రకారం విమానాశ్రయంలో ఏదైనా ఆయుధాన్ని ఉపయోగించినా, ఎవరైనా వ్యక్తిని గాయపరిచినా, హతమార్చినా, విమానాన్ని నాశనం చేసినా, విమానాల రాకపోకలకు ఆటంకం కలిగించినా, విమానాశ్రయం భద్రతకు ప్రమాదంగా పరిణమించినా, బెదిరింపులకు పాల్పడినా అందుకు బాధ్యుడైన వ్యక్తిపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాక సెక్షన్ 5ఎ ప్రకారం కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి దర్యాప్తు చేయవచ్చు. అలాగే పౌర విమానయాన ఘటనలపై దర్యాప్తు జరిపే పరిధి ఎన్‌ఐఏకు ఉంది. విమానాశ్రయంలో చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరిగినప్పుడు ఎన్‌ఐఏ చట్టం ప్రకారం అందుకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారాన్ని నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఆ నివేదిక ఆధారంగా ఎన్‌ఐఏ దర్యాప్తుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి పంపనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసింది. ఈ కేసును పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తోంది. పౌర విమానయాన భద్రత చట్టం కింద కేంద్రం రంగంలోకి దిగితే రాష్ట్ర పోలీసులకు దర్యాప్తు చేసే అధికారం ఉండదు. చట్ట ప్రకారం చేయాల్సిన పనులను దర్యాప్తు అధికారులు చేయడంలేదు’అని మోహన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు.
రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేయరాదు...
ఆ తరువాత ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జగన్‌పై హత్యాయత్నం ఘటనపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరపడం చట్ట విరుద్ధమని, ఈ దర్యాప్తునకు చట్ట ప్రకారం ఎటువంటి విలువా లేదన్నారు. ఉభయ రాష్ట్రాలకు ఎన్‌ఐఏ కోర్టు హైదరాబాద్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర పోలీసుల దర్యాప్తును వెంటనే నిలిపేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాక ప్రస్తుతం రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను సవరించాలని, లేని పక్షంలో ఆ ఎఫ్‌ఐఆర్‌కు ఎటువంటి విలువ ఉండదన్నారు. ఈ సమయంలో విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై పిల్ దాఖలు చేసిన బోరుగడ్డ అనిల్‌కుమార్ తరఫు న్యాయవాది కృష్ణమూర్తి జోక్యం చేసుకోవడంతో అతనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
సమాచారం ఎందుకివ్వలేదు..
ధర్మాసనం స్పందిస్తూ ‘మేం మీ (పోలీసులు) దర్యాప్తును అడ్డుకోం. అయితే కేంద్రానికి ఇప్పటి వరకూ మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే. ఇది చాలా తీవ్రమైన అంశం. అందువల్ల మాకు ఈ అంశంపై పూర్తి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.’అని స్పష్టం చేసింది. నిబంధనలు తెలియదని చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. అలాగే ఎన్‌ఐఏ చట్టం కింద సమాచారం అందుకున్న తరువాత ఏం చర్యలు తీసుకోవచ్చో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ధర్మాసనం ఆదేశించింది.