సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. 1.4.2014 నాటి ప్రాజెక్టు వ్యయానికే మాత్రమే చెల్లింపులు చేస్తామన్న ప్రకటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర నీటి వనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శులను, పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.
కేవీపీ పిల్‌ను విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక బాధ్యతను 1.4.2014కే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేర మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో గత వారం పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment