
బెరైడ్డికి హైకోర్టులో చుక్కెదురు
హత్య కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బెరైడ్డి రాజశేఖరరెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదైన హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బెరైడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న తన పార్టీ అభ్యర్థులకు అధ్యక్షుడి హోదాలో బీ ఫాం ఇవ్వాల్సి ఉన్నందున తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న బెరైడ్డి అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
పార్టీ ఉపాధ్యక్షుడు కూడా బీ ఫాం ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పగిడియాల మండలంలోని మచ్చుమర్రి గ్రామానికి చెందిన తెలుగు సాయిఈశ్వరుడు గత నెల 15న హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక బెరైడ్డి రాజశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, ఆయన సోదరుడి కుమారుడు సిద్ధార్థరెడ్డి, మరికొం దరు ఉన్నారంటూ మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఏడుగురు నిందితులపై కర్నూలు 3వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బెరైడ్డి రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను జస్టిస్ రెడ్డి కాంతారావు మంగళవారం విచారించారు. బెరైడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ హత్య కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాల్లేవన్నారు. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో పోలీసులు కావాలనే పిటిషనర్‌ను ఈ కేసులో ఇరికించారన్నారు.
ఈ వాదనను పబ్లిక్ ప్రాసిక్యూటర్ వినోద్‌కుమార్ దేశ్‌పాండే తోసిపుచ్చారు. బెరైడ్డిపై నిర్దిష్టమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. నిజంగా ఆయన పాత్ర లేకుంటే ఈపాటికే లొంగిపోయి ఉండేవారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్ రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, ఈ ప్రభావం కేసు దర్యాప్తుపై ఉంటుందని నివేదించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి... పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించారు.