సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పూర్వ కమిషనర్, ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు హైకోర్టు ఊరటనిచ్చింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ కోర్టు ధిక్కార కేసులో ఆయనకు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖకు చెందిన జుపిటర్ ఆటోమొబైల్స్ వాల్తేర్‌లో తాము చేపట్టిన నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసేలా జీవీఎంసీని ఆదేశించాలంటూ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు జుపిటర్ ఆటోమొబైల్స్‌కు భవన నిర్మాణ అనుమతినివ్వాలంటూ జీవీఎంసీని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో సదరు సంస్థ జీవీఎంసీ అప్పటి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామచంద్రరావు జీవీఎంసీ కమిషనర్ తీరును తప్పుపట్టారు. కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చారు. ఇందుకు గాను కోర్టు ధిక్కారం కింది కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు నెల రోజుల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై అప్పీల్ దాఖలు చేసేందుకు వీలుగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపేశారు.
ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రవీణ్‌కుమార్ ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. కమిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. సింగిల్ జడ్జి తీర్పు గురించి ఏజీ వివరించారు. అనంతరం ఆ తీర్పు అమలును నిలిపేస్తూ ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌కు ఊరట
Published Thu, Mar 30 2017 8:24 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
Advertisement