
Ramojirao
విశాఖపట్నం, న్యూస్‌లైన్: కేసు విచారణ పూర్తయ్యేవరకు విశాఖ సీతమ్మధారలోని భవనంలోనే ఈనాడు కార్యాలయం కొనసాగాలంటే నెలకు రూ. 17 లక్షలు చొప్పున అద్దె చెల్లించాలని ఈనాడు యజమాని రామోజీరావును హైకోర్టు ఆదేశించింది. అలాగే పాత బకాయిలు రూ. 2.06 కోట్లను వచ్చే నెల 10వ తేదీలోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
ఈనాడు కార్యాలయం స్థల యజమాని మంతెన ఆదిత్య కుమారవర్మ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన వివిధ పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారె డ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వర్మ నుంచి రామోజీరావు 1973 మార్చి 30వ తేదీన 2.78 ఎకరాల స్థలం, 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాలను 33 సంవత్సరాల కాలపరిమితికి అద్దెకు తీసుకున్నారు. అద్దె గడువు 2007, ఏప్రిల్‌తో ముగిసింది. పిదప లీజు కాలాన్ని పొడిగించడానికి వర్మ నిరాకరించడంతో రామోజీరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. లీజు సమయంలో తొలుత రూ. 2,500 తదనంతరం రూ. 3 వేలు అద్దె చెల్లించడానికి రామోజీ అంగీకరించారు. అయితే అద్దె సక్రమంగా చెల్లించకపోవడంతో వర్మ ఆర్‌సీసీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అక్కడ రామోజీరావుకి చుక్కెదురైంది. నెల రోజుల్లో భవనం ఖాళీ చేయాలని ఆదేశిస్తూ అద్దె నియంత్రణ న్యాయస్థానం (ఆర్‌సీసీ) తీర్పు ఇచ్చింది. దీనిపై రామోజీరావు విశాఖలోని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో అప్పీలు చేయగా... ఆర్‌సీసీ ఉత్తర్వులపై కోర్టు స్టే ఇచ్చింది. ఇదిలాఉండగా ప్రిన్సిపల్ సివిల్ కోర్టులో స్టేను తొలగించాలని కోరు తూ వర్మ ఈ ఏడాది అక్టోబర్‌లో హైకోర్టును ఆశ్రయించారు. స్థానికంగా అద్దెలు పెరిగిన విషయమై అద్దె చట్టాన్ని ప్రస్తావిస్తూ ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్తను పిటిషన్‌లో ప్రస్తావించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దిగువ కోర్టులో స్టే కొనసాగించాలంటే ప్రస్తుత ప్రభుత్వ భూమి విలువ ప్రకారం 5 శాతం విలువను ప్రతీ నెల అద్దె కింద చెల్లించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.