ఎమ్మిగనూరు: అధికార పార్టీలో భేదాభిప్రాయాలు భగ్గుమన్నాయి. అసంతృప్తులు రచ్చకెక్కాయి. ఆధిపత్యం కోసం కోర్టు మెట్లు ఎక్కేటట్లు చేశాయి. ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ పాలకవర్గం ఏర్పాటులో ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డికి పరాజయం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికార పార్టీ ప్రధాన నాయకుడు కాసులకు కక్కుర్తి పడి నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఏం జరిగిందంటే..
ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు పాలకవర్గాన్ని నియమిస్తూ గత నెల 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రధాన ప్రజాప్రతినిధికి రూ. 30లక్షలు ముడుపులు ముడితేనే ముహూర్తం ఖరారంటూ ఓ రిటైర్డ్ డీఈ ద్వారా పాలకవర్గంతో రాయబేరాలు జరిగాయి. చివరకు గురువారం ఉదయం 11.10 గంటలకు ప్రమాణ స్వీకారం ముహూర్తం ఖరారు చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో గత నాలుగేళ్లలో వివిధ మండలాల్లోని పార్టీ నాయకులు దూరమవుతూ వచ్చారు. తాజాగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపికతో మరింత దుమారం రేగింది. ఈ వ్యవహారంపై జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జె. పుష్పావతి, ఆమె భర్త నాగరాజుగౌడ్ తమ వర్గీయులతో హైకోర్టులో పిటిషన్ వేయించారు. పాలకవర్గం ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో అసంబద్ధంగా ఉందని, ప్రమాణ స్వీకారం చేయించరాదంటూ హైకోర్టు బుధవారం స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
పరువు పోతుందని..
హైకోర్టు నుంచి వచ్చిన స్టే ఉత్తర్వులను గురువారం ఉదయం 7.30 గంటలకు కలెక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ శాఖ ఏడీకి పిటిషనర్ తరఫు లాయర్ అందజేశారు. మార్కెటింగ్ శాఖ నుంచి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డుకు స్టే ఉత్తర్వులు మెయిల్ ద్వారా అందాయి. బుధవారం అర్ధరాత్రే స్టే ఉత్తర్వులు రావడం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు గురువారం ఉదయం 8.30 గంటలకే చైర్మన్‌గా మాధవరావ్ దేశాయి బాధ్యతలు తీసుకుంటున్నట్లు సెక్రటరీ ఆర్. జయలక్ష్మి ద్వారా చెప్పించారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు చేరుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి జిల్లా అధికారుల ద్వారా స్టే విషయం తెలియడంతో నొచ్చుకున్నట్లు తెలిసింది. ‘‘పార్టీలో ఉన్న క్యాడర్‌ను సమన్వయం చేసే సామర్థ్యం కూడా లేకపోతే ఎలా? టీడీపీ నేతలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేలు తీసుకురావడం ఏమిటి? పద్ధతులు మార్చుకోరా?’’ అంటూ స్థానిక ప్రధాన ప్రజాప్రతినిధిపై డిప్యూటీ సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకుడొకరు తెలిపారు. కార్యక్రమం జరగకపోతే నియోజకవర్గంలో తన పరువు పోతుందని, ఇలా పాల్గొని అలా వచ్చేద్దామంటూ ప్రజాప్రతినిధి బతిమిలాడడంతో కేఈ అయిష్టంగానే హాజరైనట్లు తెలుస్తోంది. అయితే మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార కార్యక్రమంటూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగాలు చేయడం కూడా కోర్టు ధిక్కారం కిందే వస్తుందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.
అభాసుపాలు..
ఏదిఏమైనా కార్యక్రమం అభాసు పాలు కావడంతో ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ముభావంగా కనిపించారు. ఇంత ఖర్చు పెట్టి సాధించుకున్న చైర్మన్ గిరి ప్రమాణ స్వీకారం జరగకపోవడంతో మాధవరావ్ దేశాయ్ కూడా తీవ్ర కలత చెందారు. పైగా మాధవరావ్ దేశాయ్‌కు సభలో ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం కల్పించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు అవమానభారంతో రగిలిపోయారు. ఇదిలావుండగా.. స్టే కాపీ రాకముందే తాను చార్జ్ తీసుకున్నట్లు మాధవరావ్ మీడియాకు తెలిపారు. మార్కెటింగ్ శాఖ నుంచి జిల్లా స్థాయి, స్థానిక అధికారులే కాకుండా కనీసం అటెండర్లు కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. అధికార పార్టీలో విభేదాలకు ప్రమాణ స్వీకారోత్సవం అభాసుపాలు కావడమే నిదర్శమని పలువురు వ్యాఖ్యానించారు.
అసంబద్ధ ప్రసంగం..
అధికార పార్టీ నేతలు స్టే తెస్తే ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాత్రం.. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని, వారు ఎమ్మిగనూరులో అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ అసంబద్ధంగా ప్రసంగించారు. దీంతో సభలో ఆ పార్టీ నేతలే తెల్లముఖం వేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి మాట్లాడుతూ.. పాలకవర్గం ప్రమాణ స్వీకారం తాత్కాలికంగా బ్రేక్ పడిందని, లోపాలను సరి చేసి కొత్త జీవో తీసుకువస్తామని తెలిపారు. డిప్యూటీ సీఎం కేఈ మాట్లాడుతూ.. పార్టీలో అందర్ని సమన్వయం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు పోవాలని, ఈ సమస్యను ఆయనే పరిష్కరించుకోగలరంటూ చలోక్తి విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment