సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగుదేశం ప్రభుత్వానికి కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని ప్రాంత భూసేకరణ కోసం ప్రభుత్వం జారీచేసిన 166 జీవోపై రెండు వారాల పాటు స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక ప్రభావ అంచనాను విస్మరించారని, అందువల్ల ఈ జీవో అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నామని కోర్టు తెలిపింది. ల్యాండ్ పూలింగ్ సాధ్యం కాకపోవడంతో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ఈనెల 18న చంద్రబాబు సర్కారు ఈ జీవో జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో విచారణకు రాగా ప్రముఖ న్యాయవాది రవిశంకర్ పిటిషనర్ల తరఫున వాదించారు. ఆ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జీవో నెం. 166 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలోనే ఈ జీవోను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వానికి గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భూసేకరణ మీద చర్చ జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు కూడా దీని గురించే వాయిదా పడుతున్నాయి. బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదని, సామాజిక ప్రభావ అంచనా తీసుకోవాలని, ఐదేళ్ల పాటు భూములను వినియోగించకపోతే వాటిని వెనక్కి ఇవ్వాలని, 80 శాతం రైతులు తప్పనిసరిగా భూసేకరణకు ఆమోదం తెలపాలని ఇంతకుముందు భూసేకరణ చట్టంలో ఉండగా, వాటిని తొలగిస్తూ ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది. అయితే రెండుసార్లు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా అది ఆమోదం పొందలేదు. దాంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గుతోంది. ఇలాంటి సమయంలో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలనుకున్న ఏపీ సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు.