తెలుగుదేశం పార్టీలోనే కాదు.. జిల్లాలోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తెలుగుదేశం పార్టీలోనే కాదు.. జిల్లాలోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ నేత. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవినీ నిర్వర్తించారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయంలో మహిళా ఓటర్ల పాత్ర కీలకమంటే అతిశయోక్తి కాదు. అంతటి సీనియర్ నేత మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తుండడం పట్ల జిల్లాలో మహిళా లోకం విస్తుబోతోంది. ఆడపడుచుల పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే.. మందలించాల్సిన వ్యక్తి.. తానే తోటి శాసనసభ్యురాలిని కించపరచడాన్ని జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాల నాయకులు నిరసిస్తున్నారు.
శాసనసభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై సోమవారం బుచ్చయ్య అనుచితంగా ప్రవర్తించడం పట్ల జిల్లా అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజా అసెంబ్లీలో గౌరవప్రదంగా, హుందాగా వ్యవహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే సహించలేకే.. బుచ్చయ్య ఇటువంటి వాఖ్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా గోరంట్ల రాజమండ్రిలో పేద మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారని, ఆ సందర్భంగా చేదు అనుభవాన్ని చవి చూశారని మహిళా సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. బుచ్చయ్య మాటలకు రోజా కన్నీటి పర్యంతం అయిన వైనం చూసి, రాజకీయాల్లో సీనియర్ అయి ఉండి అధికార పార్టీ నేతకు ఇదేం సంస్కారం అంటూ మండి పడుతున్నారు.
గతంలోనూ ఇలానే అనుచితంగా..
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వరుస ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందు రాజమండ్రిలో నిర్మించిన పేదల గృహాలను లబ్ధిదారులకు అందచేస్తున్న సమయంలో గోరంట్ల వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సుమారు ఎనిమిదేళ్లుగా సొంత ఇంటి కల అందని ద్రాక్షగా మారిన తరుణంలో ఇళ్ల పంపిణీకి అధికాారులు రంగం సిద్ధం చేస్తే వాటిని అడ్డుకోనేందుకు తన బలగంతో పాటు గోరంట్ల చేసిన ప్రయత్నాన్ని మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో కూడా మహిళల పట్ల బుచ్చయ్య చౌదరి దురుసుగా వ్యవహరించిన తీరు ఆ సందర్భంలో ఆడపడుచులకు ఆగ్రహం తెప్పించింది. అప్పట్లో గోరంట్ల మహిళా లబ్ధిదారుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది సహించలేక మహిళల తిరగబడ్డారు. నిజంగా దుమ్మెత్తి పోయడమే కాక చెప్పులు చూపించి మరీ తరిమి కొట్టారు.
సొంత పార్టీ మహిళల పట్లా అంతే..
రాజమండ్రి నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూడా కార్పొరేటర్ల టిక్కెట్టు ఇస్తానని మహిళా అభ్యర్థులకు ఆశపెట్టి తర్వాత వేరొకరికి కట్టబెట్టిన సందర్భంలో పలువురు గోరంట్ల ఇంటికి వెశ్లి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. శాపనార్థాలు పెట్టారు. ఆ తర్వాత కార్పొరేషన్‌లో మహిళా కో ఆప్షన్ సభ్యుల ఎంపికలో కూడా గోరంట్ల చివరి క్షణం వరకూ ఓ మైనారిటీ మహిళకు అవకాశం కల్పిస్తానని చెప్పారు. గంపెడాశతో సమావేశ మందిరం వద్దకు కూడా వచ్చిన తర్వాత మరొకరికి ఇవ్వడంతో ఆ మహిళ కంటతడి పెట్టింది. బుచ్చయ్య బహిరంగంగా తనను అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా.. పలు సందర్భాల్లో గోరంట్ల మహిళల పట్ల అనుచిత వైఖరిని గుర్తు చేసుకుంటున్న వారు.. సోమవారం నాటి సంఘటనను బట్టి ఆయన తీరు మారలేదని దుయ్యబడుతున్నారు.