
విశాఖ భూకుంభకోణం విచారణలో హైడ్రామా
విశాఖపట్నం భూకుంభకోణం విచారణలో హైడ్రామా నెలకొంది.
విశాఖపట్నం: విశాఖపట్నం భూకుంభకోణం విచారణలో హైడ్రామా నెలకొంది. విశాఖపట్నంలో భారీగా తమ భూములను కబ్జా చేశారంటూ బాధితులు ఫిర్యాదులతో వెల్లువెత్తుతుండగా.. ఈ స్కాంపై దర్యాప్తుకు ఏర్పాటైన సిట్ మాత్రం ఫిర్యాదుల స్వీకరణను నిలిపివేసింది. బాధితుల ఫిర్యాదులతో అధికార పార్టీ నేతల భూకబ్జాల బాగోతం బయటపడుతుండటంతో చంద్రబాబు ప్రభుత్వంలో అలజడి మొదలైంది.
ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఫిర్యాదుల స్వీకరణ గడువును పెంచలేదు. సిట్ దర్యాప్తు పరిధిని పెంచినప్పటికీ ఫిర్యాదుల గడువును పెంచకపోవడంపై బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో కేవలం 276 ఎకరాలు మాత్రమే కబ్జా అయ్యాయని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రకటనకు అందుతున్న ఫిర్యాదులకు మధ్య ఎక్కడ కూడా పొంతన కుదరడం లేదు. విశాఖలో 1700 ఎకరాలకుపైగా భూములు కబ్జా అయ్యాయని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.