సిట్ సభ్యురాలు వై.వి.అనురాధ
మహారాణిపేట(విశాఖ దక్షిణ): విశాఖలో భూ కుంభకోణాలపై వచ్చిన ఫిర్యాదుల విచారణ వేగవంతం చేసినట్టు సిట్ సభ్యురాలు, మాజీ ఐఏఎస్ అధికారి వైవీ అనురాధ వెల్లడించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను ఉప కలెక్టర్లకు అందజేశామని,వీరు విచారణ అనంతరం అవసరమైతే క్షేత్ర స్థాయి పర్యటన చేస్తామని ఆమె చెప్పారు. సోమవారం సిట్ కార్యాలయంలో అనురాధ విలేకరులతో మాట్లాడారు. సిట్‌కు మొత్తం 2497 ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 1594 సిట్ పరిధిలో వున్నాయని, నాన్ సిట్ పరిధిలో 914 ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు. సిట్ మొదటి దశ (13 మండలాలు పరిధి)లో 1381 ఫిర్యాదులు, సిట్ రెండో దశ(గుర్తించిన 13 మండలాలు కాకుండాఇతర ప్రాంతాలు)లో 182 ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు.
భారీగానే ట్యాంపరింగ్..
జిల్లాలో ప్రభుత్వ,జిరాయితీ భూముల రికార్డులు భారీగా ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించామని వై.వి.అనురాధ తెలిపారు. 252 ఫిర్యాదులు ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించామని, 204 ఫిర్యాదులు క్లాసిఫికేషన్ ఛేంజ్ అయినట్టు గుర్తించామన్నారు. ట్యాంపరింగ్ ఎక్కువగా ఆనందపురం మండలంలో ఉన్నాయని, రెండో స్థానంలో పెందుర్తి , మూడో స్థానంలో భీమిలి మండలం ఉందని ఆమె తెలిపారు. ముందుగా ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్ మీద దృష్టి పెట్టామని, ఆ తర్వాత జిరాయితీ భూముల ట్యాంపరింగ్‌పై దృష్టి సారిస్తామన్నారు. పత్రిక పబ్లికేషన్ ఆధారంగా ఏడు అంశాల్లో ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విభజించి ఉప కలెక్టర్లకు పంపామని, వారి నుంచి వచ్చిన నివేదిక తర్వాత తాము విచారణ చేస్తామన్నారు. తొలి విడతగా తహసీల్దార్లకు 35 ఫైల్స్ పంపామని, వీటి విచారణ పూర్తయిన తర్వాత తదుపరి విచారణ కొనసాగిస్తామని ఆమె వెల్లడించారు.
జిరాయితీ భూములు 22ఏ జాబితాలోకి..
జిల్లాలో అనేక ప్రాంతాల్లో జిరాయితీ భూములను 22ఏలో చేర్చారని, ఒక్కసారిగా తహసీల్దార్లు ఎందుకు చేర్చారన్న దానిపై సమాధానం లేదని సిట్ సభ్యురాలు వై.వి.అనురాధ తెలిపారు. దీనిపై జిల్లా రిజస్ట్రార్ ఎస్.మన్మథరావు నుంచి నివేదిక తీసుకున్నామని, 22 ఏ పేరిట అనేక భూములకు రిజిస్ట్రేషన్ చేయడం లేదని, దీని వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించామన్నారు. ,తహసీల్దార్లు కావాలని కొన్ని భూములను 22ఏ పెడుతున్నారన్న అనుమానం వుందని ఆమె వివరించారు. దీనిపై తహసీల్దార్లను పిలిచి విచారణ చేస్తామన్నారు.
సిబ్బంది కొరత లేదు..
సిట్ విచారణ కోసం అవసరమైన సిబ్బందిని ఇచ్చారని, నలుగురు ఉప కలెక్టర్లు, నలుగురు డిప్యూటీ తహసీల్దార్లు,4 జూనియర్ అసిస్టెంట్లు,నాల్గోవ తరగతి సిబ్బందిని కూడ ఇచ్చారని అనురాధ తెలిపారు. వినతులు స్వీకరించడానికి కౌంటర్‌కు అవసరమైన సిబ్బందిని కూడా కేటాయించారని వివరించారు. ఈ కౌంటర్‌లో వినతులు స్వీకరిస్తున్నామని, సిబ్బంది రావడంతో విచారణ వేగవంతం చేసినట్టు తెలిపారు. సమావేశంలో సిట్ సభ్యుడు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment