చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో ధరల షాక్‌! | high rates in chandranna village malls, comparing with other stores | Sakshi
Sakshi News home page

గోల్‌'మాల్‌'

Published Mon, Dec 18 2017 2:40 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

high rates in chandranna village malls, comparing with other stores - Sakshi

సాక్షి, అమరావతి : చౌకధరల దుకాణాల స్థానంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’లో ధరలు షాక్‌ కొడుతుండడంతో ప్రజలు నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో లభిస్తున్న ధరలకన్నా ఈ మాల్స్‌లో ధరలు ఎక్కువ ఉండడం చూసి జనం అవాక్కవుతున్నారు. ధరల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండడంతో చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం సబ్బులు, ఇతర సౌందర్యసాధనాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అవి కూడా మార్కెట్‌ రేట్లకే కావడం విశేషం. ఒకటి రెండు రోజుల్లో సరుకులన్నీ వస్తాయని డీలర్లు చెబుతున్నారు.  ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రేషన్‌ షాపులను.. రిలయన్స్‌తో పాటు చంద్రబాబుకు వాటాలున్న  ఫ్యూచర్‌ గ్రూప్‌లకు అప్పగించేస్తుండడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుండగా అవే ఉత్పత్తుల ధరలు వినియోగదారుల వద్దకు వచ్చేసరికి దిమ్మతిరిగేలా షాక్‌ కొడుతున్నాయి. అందులోనూ చౌకధరల దుకాణాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు తెచ్చిన చంద్రన్న మాల్స్‌లో ధరలు భారీగా ఉండడంపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది.

40శాతం చౌక ధరలంటూ ప్రచారం..
రాష్ట్రంలో 29 వేల రేషన్‌షాపులు ఉన్నాయి. వీటిల్లో ఎంపిక చేసిన 6,500 దుకాణాల్లో చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైలెట్‌ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరులోని రెండు దుకాణాలను ఎంపిక చేసింది. మిగిలిన దుకాణాలను వెంటనే ప్రారంభించనున్నామని, వీటిల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే 40 శాతం తక్కువకు అందుబాటులోకి తీసుకు వస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎంపిక చేసిన విలేజ్‌ మాల్స్‌ ఆకర్షణీయంగా ఉండే ఏర్పాట్లు  కూడా చేసింది. దీంతో ఈ మాల్స్‌లోని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 12 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను ప్రారంభించారు.

మొదటి రోజు ప్రారంభోత్సవ హడావుడి ఉండటంతో ఆ రోజు అమ్మకాలు పెద్దగా జరగలేదు. 13 వ తేదీన విజయవాడ భవానీపురంలోని విలేజ్‌మాల్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. అయితే బయట మార్కెట్‌ కంటే అక్కడి  నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు కొనుగోలుదారులు ఇంటికి తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నించారు. అయితే దుకాణదారుడు వాటిని  తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదు. ఆ రోజున దాదాపు రూ.6 వేల విలువైన నిత్యావసర వస్తువుల అమ్మకాలు జరిగాయి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కొందరు అధికారులు కొనుగోలుదారుల అభిప్రాయాలను తెలుసుకుని అదే రోజు సాయంత్రం నుంచి అమ్మకాలను నిలిపివేయాలని, అక్కడి నుంచి నిత్యావసర వస్తువులను తీసేయాలని ఆదేశించారు. 14వ తేదీ నుంచి ఆ దుకాణంలో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వచ్చిన కొనుగోలుదారులు తిరిగివెళ్లిపోయారు. వచ్చిన వారికి రెండు మూడు రోజుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెబుతూ, దుకాణంలోని మిగిలిన సబ్బులు, పేస్టుల ధరలు మార్కెట్‌ కంటే తక్కువగా ఇస్తున్నామని చెబుతున్నారు.

రైతు నుంచి వినియోగదారుడి వరకూ...
ఏ పరిశ్రమలోనైనా ఒక ఉత్పత్తి బైటకొస్తే యజమాని దాని ధర నిర్ణయించి అమ్ముకుంటాడు. కానీ అలాంటి అవకాశం లేని ఉత్పత్తిదారుడు బహుశా రైతు ఒక్కడేనేమో. పండించిన పంటకు ధరలు నిర్ణయించేది ప్రభుత్వమో.. దళారీలో.. వారు చెప్పిన ధర గిట్టుబాటు కాకపోయినా పంటను తెగనమ్ముకోవలసిందే.  వేరుశనగ, మినుము, కందులు, పసుపు సహా  ఏ పంటకూ ధర లేదు. రైతులు పంటలు బాగా పండించినపుడు పూర్తిగా రేటు లేకుండా పోతోంది. అయితే వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి రేట్లు షాక్‌ కొడుతుంటాయి. ఇదెలా జరుగుతోందంటే దళారులు వచ్చి రైతుల దగ్గర నుంచి పంటను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత రేట్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడ్డగోలుగా మోసం చేస్తున్నారు.

వేరు శనగ పరిస్థితి అంతే.. రైతుల వద్ద క్వింటా రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే వేరు శనగ హెరిటేజ్‌ షాపుల్లో  కేజీ రూ.150 పలుకుతోంది. రైతుల వద్ద శనగలు క్వింటా సగటున రూ. 3,500లకే కొంటున్నారు. అంటే కిలో రూ. 35 అన్నమాట. హెరిటేజ్‌ షాపులో మాత్రం కేజీ రూ.180లకు అమ్ముకుంటున్నారు. కందులను రైతుల దగ్గర క్వింటా రూ. 2,500లకు కొని, తన హెరిటేజ్‌లో మాత్రం  కేజీ కందిపప్పును రూ. 80లకు అమ్ముకుంటున్నారు. రూ.25కు కొని రూ.80కి అమ్ముతారా? ఇంత అన్యాయమైతే రైతెలా బతుకుతాడు?  మిర్చికి కూడా గిట్టుబాటు ధరలేక రైతు మండిపోతున్నాడు. క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3 వేలు మాత్రమే ధర ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో అయితే... క్వింటా రూ. 8 వేలపైనే ఉంది. ఇపుడు కంది, మినుము, పెసర ధరలు క్వింటా సగటున రూ. 3 నుంచి 4 వేల మధ్యే ధర పలుకుతున్నాయి. వైఎస్సార్‌ హయాంలో రూ. 8 వేలకు తగ్గలేదు. ఇవాళ పసుపు ధర రూ. 4వేలు, రూ. 5 వేల మధ్య ఉంది. వైఎస్‌ పాలనలో  రూ. 13 నుంచి రూ. 14 వేలుంది.

అవికూడా మార్కెట్‌ ధరకే..
సబ్బులు, పేస్టులు వంటి వస్తువుల ఎంఆర్‌పీపై 8 నుంచి 12 శాతం వరకు రేటు తగ్గించి అమ్ముతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. అయితే ఎంఆర్‌పీపై ఆ శాతం తగ్గించి వాటిని అమ్ముతున్నప్పటికీ మార్కెట్‌లోని మిగిలిన దుకాణాదారులు అదే ధరకు ఆ వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో సబ్బులు, పేస్టుల వంటి వస్తువుల ధరలు కూడా తక్కువగా ఏమీ లేవని కొనుగోలుదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా చంద్రన్న విలేజ్‌మాల్‌లోని ధరలు ఉండటంతో శని, ఆదివారాలు కూడా కొనుగోలుదారులు రాలేదు. దాంతో ఆ మాల్‌ వెలవెలబోయింది.

ఆందోళనలో చౌకడిపోల డీలర్లు..
రాష్ట్రంలోని 6,500 చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన విజయవాడ, గుంటూరులోని మాల్స్‌లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు లేకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం మినహా ఇతర వస్తువులు విక్రయించే అవకాశం ఉండదనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్నమాల్స్‌గా చౌకధరల దుకాణాలను ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాలకు నామమాత్రపు వడ్డీ కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయంలో ఉన్నారు.  కొందరు చౌకధరల దుకాణదారులు తమ దుకాణాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అమ్ముకుంటూ నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు సంపాదించుకుంటున్నారు. చంద్రన్న విలేజ్‌మాల్‌గా ఆ దుకాణం మారితే మిగిలిన వస్తువులు అమ్ముకునే అవకాశం లేక నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఏం కొంటాం..ఏం తింటాం
రేషన్‌ షాపులను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మారుస్తున్నారంటే దానిలోని అన్ని రకాలు సరుకులు తక్కువ ధరలకు దొరుకుతాయనుకున్నాం. ప్రారంభోత్సవం రోజున వెళ్లి చూస్తే పప్పు దినుసులన్నీ బయట మార్కెట్‌కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంత రేట్లు ఉంటే ఇక్కడి వరకూ రావడం దేనికి. ఇంటికి దగ్గరలో ఉన్న పచారి షాపులోనే కొనుక్కుంటాం కదా.   – షేక్‌ ఆషాబీ, కబేళా రోడ్, విజయవాడ

పప్పులు లేకుండా విలేజ్‌ మాల్స్‌ ఏమిటి?
కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు వంటి నిత్యావసర సరుకులు లేకుండా విలేజ్‌ మాల్స్‌ ఏమిటో అర్ధం కావడం లేదు. షాపునకు వెళ్లి చూస్తే నిత్యావసరాలు కనబడ లేదు. నిర్వాహకులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఈ రేషన్‌ షాపును పైలెట్‌ ప్రాజెక్ట్‌గా రెండు నెలల క్రితమే నిర్ణయించినప్పుడు ముందుగా అన్ని సరుకులు సిద్ధం చేయకపోవడం ఏమిటో?  – చిమటా గోపి, విద్యాధరపురం, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement