
సాక్షి, అమరావతి: రేషన్ షాపులను విలేజ్ మాల్స్‌గా మార్చాలంటూ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తొలి విడతలో 6,500 రేషన్ షాపులను ‘అన్న విలేజ్ మాల్స్’గా మార్చాలని సూచించారు. ఈ మేరకు తయారు చేసిన ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. శుక్రవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ మాల్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రత్యేక లోగో తయారుచేయాలని ఆదేశించారు. 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ‘అన్న విలేజ్ మాల్’ కోసమయ్యే వ్యయంలో 25 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరో 25 శాతం వ్యయాన్ని ‘ముద్ర’ నుంచి డీలర్‌కు రుణంగా ఇప్పిస్తుంది.
ఈ విలేజ్ మాల్స్‌లో డ్వాక్రా, మెప్మా, జీసీసీ ఉత్పత్తులతో పాటు రైతుల నుంచి కొనుగోలు చేసే వివిధ వ్యవసాయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతారు. అలాగే బందరు లడ్డు, కాకినాడ కాజా వంటి స్వీట్లతో పాటు పలురకాల పచ్చళ్లు కూడా లభిస్తాయి. విలేజ్ మాల్స్‌లో ఎవరైనా తమ ఉత్పత్తులను విక్రయించుకోవాలనుకుంటే.. ఆ సౌలభ్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇక రేషన్ బియ్యం వద్దనుకునే తెల్ల కార్డుదారులకు.. అంతే విలువైన ఆహార పదార్థాలను విలేజ్ మాల్స్ నుంచి కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు.
ప్రస్తుతం ఖాళీగా ఉన్న 4,599 రేషన్ షాపులకు వెంటనే డీలర్లను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులకు మార్కెట్ కన్నా 50 శాతం తక్కువ ధరకే అర కిలో పంచదార పంపిణీ చేయాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అందించే రేషన్‌లో పంచదారను కూడా జత చేయాలని చెప్పారు. అలాగే రజక, మత్స్యకార తదితర సామాజికవర్గాల వారికి వైట్ కిరోసిన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment