పెద్దలకు పేదల మాల్‌ | This is the conspiracy behind the upcoming 'Village Malls' | Sakshi
Sakshi News home page

పెద్దలకు పేదల మాల్‌

Published Tue, Dec 5 2017 3:45 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

This is the conspiracy behind the upcoming 'Village Malls' - Sakshi

పెద్దలను కొట్టి పేదలకు పెట్టిన రాబిన్‌ హుడ్‌ కథలు మనం చాలా చదువుకున్నాం. ఇపుడు రాష్ట్రంలో ‘రాబర్‌’ హుడ్‌ శకం నడుస్తోంది. పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే ఈ ‘రాబర్‌’ హుడ్‌ లక్ష్యం. నిరుపేదలు, చిరువ్యాపారులు, కిరాణావ్యాపారులే టార్గెట్‌. చిరు వ్యాపారుల పొట్టకొట్టి కార్పొరేట్‌ కంపెనీల ఖజానాలు నింపే ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’ కాన్సెప్ట్‌ ఇదే.. 

ఒక షాపు పెట్టి సక్సెస్‌ కావాలంటే చాలా కష్టపడాలి. నాణ్యమైన సరుకులు, తక్కువ ధరలతో ఎంతో కష్టపడి ఖాతాదారులను సంపాదించుకోవాలి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ప్రాపకం సంపాదించిన కార్పొరేట్‌ కంపెనీలకు ఇవేవీ అక్కర్లేదు.  రాత్రికి రాత్రి సరుకులు, ఖాతాదారులు, లాభాలు రెడీ.. చిరువ్యాపారాలను ధ్వంసం చేసి.. ప్రజాపంపిణీ వ్యవస్థను నాశనం చేసి మరీ వాటికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తారు.. 

సాక్షి, అమరావతి:‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’ పేరుతో రాష్ట్రంలోని కిరాణా వ్యాపారాన్ని పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పే భారీ దోపీడి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి్టంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే కిరాణా వ్యాపారాన్ని దెబ్బతీస్తూ బడా కార్పొరేట్‌ సంస్థలను... ముఖ్యంగా ‘హెరిటేజ్‌’ రిటైల్‌ వ్యాపారానికి లబ్ధి చేకూర్చే సరికొత్త ఎత్తుగడకు ప్రభుత్వం తెరతీసింది. ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’ పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ.. అదే సమయంలో ఏటా రూ. 72.600 కోట్ల వ్యాపారాన్ని గంపగుత్త్తగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పనుంది. రాష్ట్రంలో ఉన్న 29 వేల రేషన్‌ షాపులన్నీ దశల వారీగా రిలయన్స్, వాల్‌మార్ట్, 6+ప్యూచర్‌ రిటైల్‌ సంస్థలకు అప్ప చెప్పి తెల్ల రేషన్‌ కార్డున్న ప్రతి పేదవాడు కూడా భవిష్యత్తులో ఆ మాల్స్‌లోనే సరుకులు కొనుగోలు చేసేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఫ్యూచర్‌ రిటైల్‌ వ్యాపారంలో చంద్రబాబు కుటుంబ సంస్థ ‘హెరిటేజ్‌ రిటైల్‌’ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేషన్‌ షాపుల ద్వారా బియ్యం ఒక్కటే పంపిణీ చేస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తిపెరుగుతోంది. దీన్ని తగ్గించడం కోసం తక్కువ ధరలకే కిరాణా వస్తువులు అందిస్తున్నామంటూ ‘చంద్రన్న విలేజ్‌ మాల్స్‌’ను తెరమీదకు తీసుకొచ్చారు. ఈ మాల్స్‌లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా అన్ని కిరాణా సరుకులను బయట మార్కెట్‌ కంటే 10 నుంచి 12 శాతం తక్కువ ధరకు అందించనున్నామంటూ ప్రచారం చేస్తున్నారు.  
 
ఇదీ... దోపీడీ లెక్క.. 
విలేజ్‌ మాల్స్‌ పేరుతో పైకి డిస్కౌంట్‌ రేట్లకే సరుకులు అందిస్తామంటున్నా.... వేల కోట్ల కిరాణా వ్యాపారాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పడమే దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. రాష్ట్రంలో సుమారు 1.40 కోట్ల  తెల్ల రేషన్‌ కార్డులున్న కుటుంబాలు ఉన్నాయి. ప్రస్తుత ధరల ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు కూడా ప్రతీ నెల బియ్యంతో పాటు అన్ని కిరాణా, ఫ్యాన్సీ సామాన్లు కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 2,000 అవసరమవుతాయి. కేవలం ఈ తెల్ల రేషన్‌ కార్డుల వారు విలేజ్‌ మాల్స్‌ ద్వారా ప్రతీ నెలా కొనే సరుకుల విలువే... అక్షరాలా రూ. 2,800 కోట్లు. వీరు కాకుండా రాష్ట్రంలో మరో 60 లక్షల మధ్య తరగతి కుటుంబాలున్నాయి. వీరి నెలసరి బడ్జెట్‌ విలువ రూ. 5,000లుగా అంచనా వేస్తే మరో రూ. 3, 250 కోట్ల వ్యాపారం కార్పొరేట్‌ సంస్థల జేబుల్లోకి వెళ్లిపోతుంది. అంటే ప్రతీ నెలా రూ. 6,050 కోట్ల చొప్పున ఏటా రూ. 72,600 కోట్ల మార్కెట్‌ను ప్రభుత్వమే పళ్లెంలో పెట్టి కార్పొరేట్‌ సంస్థలకు అప్పజెప్పబోతోందన్నమాట. కార్పొరేట్‌ సంస్థల దోపిడీ ఎలా ఉంటుందో మనమందరికీ అనుభవమే. తొలుత ఆకర్షించడానికి డిస్కౌంట్లు ప్రకటించి.. అలావాటయ్యాక ఆ సంస్థలన్నీ గుత్తాధిపత్యం కింద ధరలు పెంచుకుంటూ పోతాయి. ఇప్పుడు ఈ విలేజ్‌ మాల్స్‌లో కూడా తొలుత తక్కువ ధరకే వస్తువులు విక్రయించడంతో కొనుగోలుదారులు వాటికి పూర్తిగా అలవాటు పడి పోతారు. ఈలోగా గ్రామాల్లో చిరువ్యాపారులు, కిరాణా వ్యాపారుల వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినిపోతాయి. ఆ∙తర్వాత విలేజ్‌ మాల్స్‌లో క్రమేణా ధరలు పెంచినా వినియోగదారులు చచ్చినట్లు ఆ మాల్స్‌లోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పిస్తారు. 
 
ఇదీ విలేజ్‌ మాల్స్‌ స్వరూపం.. 
కార్పొరేట్‌ సంస్థలకు లబ్దిచేకూర్చేలా రేషన్‌ షాపులన్నీ ఆధునీకరించి వారికి అప్పగించేందుకు అవసరమైన పనులన్నీ క్షేత్రస్థాయిలో చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుత రేషన్‌ షాపులను రూ.5 లక్షలతో విలేజ్‌ మాల్స్‌గా ఆధునీకరించనున్నారు.  ఇందులో రేషన్‌ డీలర్‌ వాటా రూ. 1.25 లక్షలు, ప్రభుత్వం రూ. 1.25 లక్షలు, మరో రూ. 2.50 లక్షలు కార్పొరేట్‌ సంస్థలు ఖర్చు చేసేలా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు తయారు చేసింది. రేషన్‌ డీలర్‌ వాటా రూ. 1.25 లక్షలు ముద్ర బ్యాంకు ద్వారా రుణం ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోనుంది. ఇందులో భాగంగా మొదటి దశ కింద సుమారు 6,000 మాల్స్‌ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పైలెట్‌ ప్రాజెక్టు కింద తొలుత జిల్లాల్లో ఎక్కడెక్కడ చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేయాలో రేషన్‌ షాపుల వివరాలు పంపాలని ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఒక్కో జిల్లా నుంచి పైలెట్‌ ప్రాజెక్టు కింద 500 తక్కువ కాకుండా పూర్తి వివరాలతో రేషన్‌ షాపుల జాబితా పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
సరుకుల నాణ్యతపై బాధ్యత ఎవరిది? 

సరుకులన్నీ కూడా చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లోనే కొనుగోలు చేసేలా అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తెల్లరేషన్‌ కార్డులున్న కుటుంబాలు 1.40 కోట్లు ఉంటే వీటిలో దాదాపు 80 శాతం కుటుంబాలు సబ్సిడీ బియ్యం తినడంలేదని ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అందుకే బియ్యం వద్దనుకునే లబ్దిదారులకు వాటికయ్యే మొత్తాన్ని లెక్కకట్టి అదే మొత్తానికి చంద్రన్న మాల్స్‌లో సరుకులు తీసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రచారం చేస్తోంది. అంటే ఆ మేరకు మార్కెట్‌ అంతా ఆ మాల్స్‌కు తరలించబోతున్నారన్నమాట. కొత్తగా ప్రవేశపెట్టనున్న చంద్రన్న విలేజ్‌ మాల్స్‌లో నాణ్యమైన సరుకులు కాకుండా నాసిరకం విక్రయిస్తే ఎవరు చర్యలు తీసుకుంటారనేది అర్థంకాని సమస్య. ఎందుకంటే కార్పొరేట్‌ సంస్థలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండటంతో వారు ఎలాంటి సరుకులు విక్రయించినా అధికారులు పట్టించుకొనే పరిస్థితి కూడా ఉండదు. గత మూడేళ్లుగా సంక్రాంతి, క్రిస్‌మస్, రంజాన్‌ పండుగలకు ఐదు రకాల వస్తువులను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. నాణ్యత లేకపోతే వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని  సీఎం చంద్రబాబు ప్రకటించినా ఇప్పటికీ చర్యలు లేవు. బెల్లం, గోధుమ పిండి నాసిరకంగా ఉందని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. బాధ్యులపై వెంటనే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని చెప్పినా ఎక్కడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 
 
రేషన్‌ షాపులను క్రమంగా నీరుగార్చారు.. 
రేషన్‌ షాపులను ఒక పథకం ప్రకారం ప్రభుత్వమే నీరుగార్చుతోందనే ఆరోపణలున్నాయి. ఇందులో భాగంగానే రేషన్‌ షాపుల్లో ఇచ్చే సరుకులను ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో బియ్యం, కిరోసిన్‌తో పాటు మరో తొమ్మిది రకాలైన సరుకులు కందిపప్పు(1 కిలో), పామాయిల్‌ (1 లీటర్‌), గోధుమపిండి(1 కిలో), గోధుమలు(1 కిలో), ఉప్పు(1 కిలో), చక్కెర(అర కిలో), చింతపండు(అర కిలో), కారం పొడి(250 గ్రాములు), పసుపు పొడి(100 గ్రాములు) ఒక బ్యాగులో ఉంచి ఒక్కో లబ్దిదారుడికి రూ.185లకు ఇచ్చేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ 9 రకాల సరుకులకు మంగళం పాడటమే కాకుండా కిరోసిన్‌ను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం బియ్యం ఒక్కటే పేదలకు సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. పేదలకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించాలన్న లక్ష్యంతో ఎన్‌.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేస్తే ఆ తర్వాత అదే పార్టీ నుంచి సీఎం పీఠం మీద కూర్చొన్న చంద్రబాబు వాటిని నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకోవడం గమనార్హం.  
 
ఖర్చు మాపై వేస్తే ఎలా? : రేషన్‌ డీలర్ల ఆందోళన 
చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ అలంకరణ కోసం ఒక్కో రేషన్‌ డీలర్‌పై రూ. 1.25 లక్షలు భారం మోపాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు రేషన్‌ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు పేర్కొన్నారు. మాల్స్‌ ఏర్పాటుపై ఇప్పటి వరకు రేషన్‌ డీలర్లతో ఎలాంటి చర్చలూ జరపకుండానే ముందుకెళ్లడం అన్యాయం. డీలర్లను అడకుండానే వారి పేరిట ముద్ర బ్యాంకు ద్వారా ఒక్కొక్కరి పేరిట రూ. 1.25 లక్షలు రుణం తీసుకొని ఖర్చు చేస్తే వాటిని తిరిగి తామెలా చెల్లిస్తామని ప్రశ్నించారు. చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ నిర్వహణ రేషన్‌ డీలర్లకే అప్పగించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు చెందిన వ్యక్తులను కౌంటర్లో కూర్చోబెట్టి వారి చేత డబ్బులు వసూలు చేస్తే తాము వ్యతిరేకిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేట్‌ సంస్థలకు లబ్ది చేకూర్చి వారి నుంచి ప్రతిఫలం పొందాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. అందుకే రేషన్‌ షాపులను వారికి అప్పగించి అందులో అన్ని సరుకులూ విక్రయించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్పొరేట్‌ చేతుల్లోకి అప్పజెప్పొద్దని డీలర్లు పదేపదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా స్పష్టమైన హామీ రాకపోవడంతో డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
రేషన్‌ షాపులు మూసేసే ఎత్తుగడ 

చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ పేరుతో బడా రిటైల్‌ సంస్థలతో కలిసి రేషన్‌ షాపులను మూసే వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మార్కెట్‌ ధర కంటే 12 శాతం తక్కువ ధరకు సరుకులు ఎలా ఇవ్వగలరో ప్రభుత్వం వివరించాలి. చంద్రన్న మాల్స్‌ పేరుతో షాపులు తెరిస్తే కిరాణాషాపుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత తప్పదు. మల్టీ నేషనల్‌ కంపెనీలతో చేతులు కలిపి ఇటు రేషన్‌ దుకాణాలను, ఇటు కిరాణా షాపులను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి ప్రభుత్వమే వత్తాసు పలకడం దారుణం. 
ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షులు, ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement