ఏసీబీ వలలో హైస్కూల్ హెచ్‌ఎం
సత్తెనపల్లి (గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రూ.10 వేలు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీ వలలో చిక్కారు. వివరాలు.. జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో సర్వశిక్ష అభియాన్ నిధులతో వంటగది నిర్మించారు. ఇందుకు సంబంధించి ఒక లక్షా యాభై వైల రూపాయల చెక్కు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ వద్ద రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు.
దాంతో కాంట్రాక్టర్ వంకాయలపాటి శ్రీనివాసరావు కృష్ణాజిల్లా ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణను ఆశ్రయించారు. వల పన్నిన ఏసీబీ అధికారులు ప్రధానోపాధ్యాయురాలు కె. నాగేంద్రమ్మ పాఠశాలలో కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ, ఇతర అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ మీడియాకు చెప్పారు.