ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కుతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ పోలీసుల సహాయంతో అందిపుచ్చుకుంటోంది. ఓటుకు నోటు వ్యవహారంతో తెలంగాణలో బజారున పడిన టీడీపీ.. జిల్లాలో బలం లేకపోయినా ఎమ్మెల్సీ బరిలో అభ్యర్థిని నిలిపి ఇక్కడా అలాంటి బాగోతమే నడిపింది. చివరకు ఓటమి తప్పదని భావించి.. వైఎస్‌ఆర్‌సీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డి లక్ష్యంగా పోలీసులను ఉసిగొలిపింది. ‘తాను ప్రజాప్రతినిధి.. తాకొద్దు’ అన్నందుకు అట్రాసిటీ కేసు బనాయింపజేసింది. ఆ తర్వాత ఎలాగైనా జైలుకు తరలించేందుకు విచారణ పేరిట 12 గంటల హైడ్రామాకు అధికార పార్టీ దర్శకత్వం వహించింది. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని సూచించినా.. సెక్యూరిటీ కల్పించలేమని చేతులెత్తేసిన పోలీసు శాఖ తాము అధికార‘పక్షం’ అని చాటుకుంది. ఎట్టకేలకు భూమా దీక్షతో దిగొచ్చిన పోలీసులు చికిత్స నిమిత్తం ఆయనను శనివారం రాత్రి 9 గంటలకు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు.
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో శనివారం జరిగిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కేసు వ్యవహారం అధికార పార్టీ వేధింపులకు సాక్షిగా నిలిచింది. ఓ వైపు అధికారుల హైడ్రామా.. మరో వైపు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆందోళన ఆళ్లగడ్డలో ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం నంద్యాలలో నమోదైన కేసులో అరెస్ట్ అయిన భూమా నాగిరెడ్డిని శనివారం తెల్లవారుజామున 5.45 గంటలకు ఆళ్లగడ్డ సబ్‌జైల్‌కు తరలించారు. జైలు నిబంధనల మేరకు ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించాలి. అక్కడి వైద్యురాలు సుజాత బీపీ, చాతీ నొప్పి పరిశీలించి ‘గతంలో వైద్యం చేయించుకున్న వైద్యులను సంప్రదించండి’ అని సూచించారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఉదయం 7గంటలకు ఆయనను సబ్ జైల్‌కు తీసుకెళ్లారు. భూమానాగిరెడ్డికి ప్రత్యేక వైద్యబృందంచే వైద్యపరీక్షలు చేయించాలని పోలీస్‌లు కలెక్టర్‌కు లేఖ ఇచ్చినట్లు తెలిసింది.
కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంఅండ్‌హెచ్‌ఓ మీనాక్షిమహదేవన్, సివిల్‌సర్జన్ శ్రీనివాసులు, నంద్యాల వైద్యాధికారి శ్రీనివాసులతో కూడిన కమిటీ భూమానాగిరెడ్డికి సాయంత్రం 4.30 గంటల సమయంలో 7గంటల వరకు వైద్య పరీక్షలు నిర్వహించారు.చికిత్స నిమిత్తం భూమానాగిరెడ్డిని కర్నూలులోని పెద్దాసుపత్రికి తరలించాలని వైద్యబృందం సూచించింది. వైద్యబృందం సూచనల మేరకు 7.15 గంటలకు కర్నూలు తరలించారు.
దాదాపు 12 గంటల పాటు ఆసుపత్రికి తరలించకుండా జైల్‌లోనే ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భూమానాగిరెడ్డి సబ్‌జైలులో ఉండడంతో గ్రామాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సబ్‌జైలు ఆవరణం ప్రజలతో కిక్కిరిసిపోయింది. ప్రజలు భారీ ఎత్తున తరలివస్తుండడంతో ఉదయం సబ్‌జైలు సమీపంలో ప్రజలను లేకుండా తరిమివేశారు. పోలీస్‌లు మధ్య మధ్యలో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలను తోసివేశారు. భూమానాగిరెడ్డిని కర్నూలుకు తరలించే వరకు ప్రజలు సబ్‌జైలు వద్ద ఉన్నారు.
భూమా దీక్షతో ఆసుపత్రికి తరలింపు: భూమానాగిరెడ్డిని సబ్‌జైలు నుంచి ఆసుపత్రికి తరలించమని వైద్యురాలు సుజాత సూచించినా పోలీస్‌లు ఎస్కార్ట్ పేరుతో ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ భూమానాగిరెడ్డి సబ్‌జైలులో నిరాహార దీక్షకు దిగారు. సబ్‌జైలు ఆవరణంలో మాత్రలతో సహ టిఫిన్, భోజనం తీసుకోకుండా దీక్ష చేపట్టారు. భూమా దీక్ష చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య సబ్‌జైలుకు వచ్చి భూమాతో భేటీ అయ్యారు.
సబ్‌జైలు నుంచి బయటకు వచ్చిన ఐజయ్య విలేకరులతో మాట్లాడుతూ భూమానాగిరెడ్డిని ఆసుపత్రికి వైద్యపరీక్షల కోసం తీసుకపోకపోతే భూమాకు సంఘీభావంగా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్లగడ్డకు వచ్చి దీక్ష చేపడుతామని హెచ్చరించారు. భూమా దీక్ష చేస్తున్నట్లు తెలియడంతో సబ్‌జైలు సమీపంలో దీక్ష చేపట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఎట్టకేలకు భూమాను కర్నూలు ఆసుపత్రికి తరలించడంతో నాయకులు, కార్యకర్తలు దీక్షా నిర్ణయాన్ని ఉపసంరించుకున్నారు.
భూమా అరెస్ట్ దారుణం
ఆలూరు రూరల్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. శనివారం ఆయన ఫోన్‌లో సాక్షితో మాట్లాడారు. అధికార పార్టీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా తమపార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి విజయం ఖాయమని చెప్పారు.
అప్రజాస్వామికం
ఆళ్లగడ్డటౌన్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అరెస్టు అప్రజాస్వామ్యం అని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. శనివారం ఆళ్లగడ్డ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న భూమానాగిరెడ్డిని పరమార్శించిన ఆయన అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టాలనే..టీడీపీ నేతలు ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారు.
టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారు
ఆదోని టౌన్: అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారని ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అక్రమ అరెస్ట్ ఆయన ఖండించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖర్‌రెడ్డిపై కూడా కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ సభ్యుడ్ని తాము ఎలా కిడ్నాప్ చేస్తామని ప్రశ్నించారు.
హైడ్రామా
Published Sun, Jul 5 2015 2:46 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement