
రాజమార్గం అవశ్యం
సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు సిటీ / సంగడిగుంట : నూతన రాజధానిలో రైల్వే సేవలను విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవను పలువురు ఎంపీలు కోరారు. రైల్వే సేవల విస్తరణ కోసం ముందుగా సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. రైల్వే బడ్జెట్ రూపకల్పన కోసం అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించేం దుకు మంగళవారం ఎంపీలతో రైల్వే జీఎం విజయవాడలో సమావేశం నిర్వహించారు.
గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, విజయవాడ, బందరు, ఏలూరు, రాజమండ్రి, ఎంపీలు గల్లా జయదేవ్, రాయపాటి సాంబశివరావు, మాల్యాద్రి, కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తదితరులు రాజధాని ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రైల్వే ప్రాజెక్టులను కేటాయించాలని జీఎంను కోరారు. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో విస్తరించే రాజధాని ప్రాంతానికి రైల్వే సేవలను చేరువచేసేలా ఈసారి ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
ఎవరేమన్నారంటే...
రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఏర్పడిన నేపథ్యంలో అందుకు అనుగుణంగానే రైల్వే ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కేటాయించాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కోరారు. ఎంపీలంతా ఏకతాటిపైకి వచ్చి రాజధాని ప్రాంతానికి రైల్వే ప్రాజెక్టులు సాధిస్తారని తెలిపారు. కొత్త రాజధాని నుంచి దేశం నలుమూలలకు వెళ్లేలా రైల్వే జంక్షన్‌గా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
గుంటూరు నుంచి కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేయాలని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబ శివరావు కోరారు. నల్లపాడు, న్యూ గుంటూరు, రేపల్లె, మచిలీపట్నంలో కొత్త పిట్‌లైన్లు ఏర్పాటు చేసి రైళ్లు నడిచే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. డెల్టా ప్యాసింజర్ సమయాన్ని గతంలో మాదిరే ఉంచాలన్నారు. డబుల్ డెక్కర్‌ను సూపర్‌ఫాస్ట్‌గా కాకుండా సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా నడిపి సీతాఫల్‌మండి - నడికుడి - సత్తెనపల్లిలో కూడా ఆగేలా చూడాలన్నారు. రద్దు చేసిన నాగార్జున ఎక్స్‌ప్రెస్ రైలును తిరిగి పునరుద్ధరించాలన్నారు. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు సత్తెనపల్లిలో హాల్ట్ ఏర్పాటు చేయాలని సూచించారు. డివిజన్‌లోని అన్ని స్టేషన్లలో ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలని రాయపాటి ప్రతిపాదించారు. ఇక గుంటూరు రైల్వే స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
బాపట్ల ఎంపీ మాల్యాద్రి మట్లాడుతూ తెనాలి పశ్చిమ వైపున రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. తెనాలి - రేపల్లె మధ్య నడుస్తున్న ప్యాసింజరును గుంటూరు వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. వేమూరుతోపాటు భట్టిప్రోలులో అదనపు స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి తగినట్టుగా విజయవాడ రైల్వేస్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కోరారు. విజయవాడ నుంచి ముంబయి, కొచ్చి, త్రివేండ్రం, సూరత్, గౌహౌతి, కోయంబత్తురుకు రైళ్లు నడపాలని ప్రతిపాదించారు.
బందరు పోర్టును దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం కేంద్రంగా రైల్వే కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని ఎంపీ కొనకళ్ల నారాయణరావు కోరారు. బందరు నుంచి కోటిపల్లి, రేపల్లె రైల్వేలైన్లను విస్తరిస్తే భవిష్యత్తులో కోస్తా రైలుమార్గం కీలకంగా మారుతుందని చెప్పారు.
ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాజధాని ప్రాంతానికి చేరుకునేలా రైళ్లను నడపాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు కోరారు.
నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ ఏర్పాటుకు ఖర్చు తక్కువ అవుతుందని, రైల్వే శాఖకు ఎక్కువ ఆదాయం తెచ్చే కీలక లైన్‌గా మారుతుందని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు చెప్పారు.
కొవ్వూరు నుంచి భద్రాచలం వరకు రైల్వేలైన్ విస్తరణ పూర్తిచేయాలని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ కోరారు. రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ కోసం కొత్త రైళ్లు వేయాలని కోరారు.
మచిలీపట్నం నుంచి తిరుపతి రైలును కడప వరకు పొడిగించాలని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కోరారు.
ఈసారి ఏపీ ఎంపీలు చేసిన ప్రతిపాదనల్లో 75 శాతం వరకు సాధించుకునే అవకాశం ఉందని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. గతం నుంచి ఎన్ని పర్యాయాలు ఎంపీలు ప్రతిపాదనలు ఇచ్చినా రైల్వే బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందని హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప పెదవి విరిచారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, బుట్టా రేణుక, వరప్రసాద్ తమ నియోజకవర్గాల పరిధిలో రైల్వే బడ్జెట్‌లో తగిన న్యాయం చేయాలంటూ రైల్వే జీఎం శ్రీవాస్తవకు పలు ప్రతిపాదనలు అందించారు.