
ఎల్లాజీ నుంచి రక్షణ కల్పించాలని కంచరపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న హిజ్రాలు
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): హిజ్రాల మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. భౌతిక దాడులు.. ప్రాంతాల మధ్య ఆధిపత్యం కోసం గొడవలు పడుతున్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి రచ్చకెక్కుతున్నారు. ఒకరి వల్ల ప్రాణహాని ఉందంటే మరొకరు.. వారి వల్లే మాకు ప్రాణహాని ఉందని మిగిలిన వారు ఆందోళనకు దిగుతున్నారు. అయితే మాజీ హిజ్రాల నాయకుడు, టీడీపీ నాయకుడు సూరాడ ఎల్లాజీ తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి వివాదం తలెత్తింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ ఎదుట హై డ్రామా నడిచింది.
ఇదీ పరిస్థితి
బుధవారం ఉదయం 3గంటల సమయంలో టీడీపీ నాయకుడు, మాజీ హిజ్రాల నాయకుడు, రౌడీషీటర్ సూరాడ ఎల్లాజీ తనపై దాడి జరిగిందంటూ గాయాలతో కేజీహెచ్‌లో చేరాడు. అయితే ఎల్లాజీ డ్రామా చేస్తూ తమపై కేసులు పెట్టేందుకు చూస్తున్నాడని, అతని నుంచి మాకు ప్రాణహాణి ఉందంటూ మరో వర్గం హిజ్రాలు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో ఉత్తరాంధ్ర హిజ్రాల సంఘ సభ్యులు పాల్గొన్నారు. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఎల్లాజిపై ధర్మానగర్ వద్ద కొందరు హిజ్రాలు చేసిన దాడిలో గాయాలయ్యాయి. దీంతో ఎల్లాజీని కేజీహెచ్‌లో చికిత్స నిమిత్తం 108లో తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాలు మాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి చేశారు
గతంలో హిజ్రాల నాయకుడిగా ఉన్న ఎల్లాజీ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇక్కడి ధర్మానగర్‌లో బుధవారం ఉదయం సమయంలో తన తల్లి ఇంటి వద్ద నుంచి వస్తున్న సమయంలో కొందరు అడ్డగంచి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కిరణ్ పిలిచి రూ.15లక్షలు కావాలని డిమాండ్ చేశాడని ఆరోపించాడు. శిల్ప, మోహన్, సరిత, రమణ, అణు అనే వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నాడు.
అంతాహైడ్రామా
కంచరపాలెం పోలీస్ స్టేషన్ వద్ద హిజ్రాల ఆందోళన... ఎల్లాజీపై దాడి అంతా ఓ హైడ్రామాలా నడిచింది. బుధవారం ఉదయం ఎల్లాజీపై దాడి జరిగిన అంశం మొత్తం పెద్ద డ్రామా అంటూ హిజ్రాలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎల్లాజీ ఇంట్లో దొంగతనం చేశారంటూ గతంలో అసత్య ఫిర్యాదు చేశారని చెబుతున్నారు.
ఆదాయం లేకే!
ఎల్లాజీ వెంట హిజ్రాలు లేకపోవడంతో ఆదాయం లేక పలు ఇబ్బందులు పడుతున్నాడని, హిజ్రాలను తన వైపు తిప్పుకోవడానికి ఈ విధంగా పోలీసులకు ఫిర్యాదులు చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎల్లాజి నుంచి మాకు ప్రాణభయం ఉందని, ప్రాణ రక్షణ కావాలని హిజ్రాలు కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎల్లాజీకి న్యాయం చేయాలి
పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణ): తమ తరఫున మరో వర్గం హిజ్రాలతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఎల్లాజీపై దాడిని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిజ్రాలు కేజీహెచ్ అత్యవసర విభాగం వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ విశాఖపట్నంలో పుట్టిపెరిగిన తమపై విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, అనకాపల్లికి చెందిన హిజ్రాలు దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. తమ నాయకుడు ఎల్లాజీ పరిస్థితిని చక్కబెట్టేందుకు చేసిన ప్రయత్నంలో అతడ్ని చంపేదుకు ప్రయత్నించారని చెప్పారు.
ప్రాణాపాయం లేదు
వైద్యాధికారులు మాట్లాడుతూ ఎల్లాజీ వీపుమీద రెండు, మొలమీద ఒకటి, కుడితొడ మీద ఒకటి గాయాలున్నాయని పేర్కొన్నారు. బార్బర్ షాపులో వినియోగించే కత్తితో దాడి జరిగి ఉండవచ్చని తెలిపారు. ప్రాణాపాయం లేదని రెండు రోజుల పాటు చికిత్స అందించి డిశ్చార్జ్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment