
ఇంజినీరింగ్ విద్యార్థి తరుణ్‌కు కన్నీటి వీడ్కోలు
పిడపర్తిపాలెం (కొల్లిపర): హిమాచల్‌ప్రదేశ్‌లోని లార్జి డ్యామ్ దుర్ఘటనలో చనిపోయిన వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల్లో ఒకరైన పెనుమాక వెంకటదుర్గాతరుణ్ మృతదేహనికి శుక్రవారం పిడపర్తిపాలెంలో అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. ఈనెల 18న ప్రమాదస్థలిలో దొరికిన తరుణ్ మృతదేహాన్ని గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన తరలించిన విషయం విదితమే. వెంకటదుర్గాతరుణ్ మృతదేహం గ్రామానికి చేరుకుంటుందన్న విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో గ్రామానికి వచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.
ఇంజినీర్‌గా ప్రయోజకుడై వస్తాడనుకున్న కుమారుడు ఇంటికి శవమై రావడంతో ఇలాంటి పరిస్థితి పగవారికైనా రాకూడదంటూ తరుణ్ తల్లిదండ్రులు సుబ్బారావు, జయలక్ష్మి(బుజ్జి) రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. డ్యామ్‌లో అంచెలంచెలుగా విడుదల చేయాల్సిన నీటని నిబంధనలకు విరుద్ధంగా ఒక్కసారిగా 400 టీఎంసీల నీటిని విడుదల చేయడం వల్లే విద్యార్థులు అధిక సంఖ్యలో మృత్యువాత పడ్డారని తరుణ్ తండ్రి సుబ్బారావు అన్నారు. ఇది కచ్చితంగా అధికారుల తప్పిదమేనన్నారు. తరుణ్ మృతదేహానికి మండల తహశీల్దార్ కె.సాయిప్రసాద్, సర్పంచ్ బొల్లు కృష్ణప్రియ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కన్వీనర్ చిక్కాల రాజేంద్ర, పలువురు గ్రామపెద్దలు నివాళులర్పించారు.