
విజయవాడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ హత్య, హైదరాబాద్‌లో కన్నకూతురిపైనే తండ్రి హత్యాయత్నం ఉదంతాలు కలకలం రేపాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారి తీశాయి. అలాగే కులాంతర వివాహాలు చేసుకున్న నవదంపతులు, ఇప్పటికే ప్రేమలో మునిగి పెళ్లికి సిద్ధపడుతున్న ప్రేమ పక్షుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అయితే ఈ భయాలకు ఆజ్యం పోస్తూ విజయవాడలో పరువు హత్య పోస్టర్లు సంచలనం సృష్టించాయి. విజయవాడ నగరంలోని సత్యానారాయణపురంలో దర్శమిచ్చిన ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. స్థానిక శివాలయ వీధిలో ఈ పోస్టర్లు వెలిశాయి. ‘పరుపు హత‍్యకు గురి కానున్న సోని రాహు ప్రియ’ అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను అతికించారు. దీంతో కలకలం మొదలైంది.
మరోవైపు ఈ వివాదాస్పద పోస‍్టర్లపై పోలీసులు దృష్టి సారించారు. వీటిపై ఆరా తీస్తున్నారు. అసలు సోని రాహు ప్రియ ఎవరు? ఎవరిని భయపెట్టడానికి ఈ పోస్టర్లు? ఇది కేవలం ఆకతాయిల పనేనా? లేక నిజంగానే మరో అఘాయిత్యం చోటు చేసుకోబోతోందా? ఈ దిశగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.