నాగోలు, న్యూస్‌లైన్: ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు, బాధితుల కథనం.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కల్వెపల్లికి చెందిన ఎం.సైదానాయక్‌కు డెంగీ రావడంతో అతని డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమత్తం మొదట మిర్యాలగూడ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు హైదరాబాద్‌లోని కొత్తపేట గ్రీన్స్‌హిల్స్ కాలనీలో గల ఓజోన్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు నాయక్‌ను ఓజోన్ ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం చేర్పించారు.
సైదానాయక్‌ను వైద్యులు పరీక్షించి ఎర్ర రక్తకణాలు పెరిగాయని వైద్యచికిత్స చేయడం ప్రారంభించారు. మొదట గ్లూకోజ్ ఎక్కిం చారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా బ్లడ్ మోషన్స్ కావడంతో కలవరపడిన కుటుంబ సభ్యులు ఆస్పత్రి వర్గాలకు తెలియజేశారు. వైద్యులు రక్త నమూనాలను సేకరించి పరీక్షించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 10 గంటలకు సైదానాయక్ చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని, రాత్రి నుంచి ఉదయం వరకు ఒక్క డాక్టర్ కూడా పరీక్షించలేదని ఆగ్రహంతో ఆస్పత్రిలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు బాధిత కుటుంబ సభ్యులను శాంతింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. వైఎస్సార్ సీపీ నల్లగొండ జిల్లా కన్వీనర్ సోమిరెడ్డి ఆస్పత్రి దగ్గరకు చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బ్లడ్ క్యాన్సర్‌తో రక్తం కక్కుకుని సైదానాయక్ మృతి చెందాడని ఆస్పత్రి డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి డెంగీ ఫీవర్‌గా పరీక్షలు నిర్వహించామని, ఇంతలోనే బ్లడ్ క్యాన్సర్ బయటపడి సైదా నాయక్ మృతి చెందాడని తెలిపారు.
మృతదేహాన్ని సందర్శించిన మంత్రి జానారెడ్డి
సైదానాయక్ మృతదేహాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.జానారెడ్డి సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన
Published Sun, Sep 22 2013 3:40 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement