
ప్రభుత్వాస్పత్రి ఏఎంసీలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న వెంకయ్య వెంకయ్య భార్య అనంతలక్ష్మి
అంపశయ్యపై భర్త.. ఎప్పుడు మృతి చెందుతాడో తెలియని పరిస్థితి. మరోవైపు భర్త చనిపోతే మృతదేహాన్ని ఇంటికి తీసుకు రావద్దంటూ అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో పాటు, సమీపంలో ఉన్న వారు ఆదేశాలు. శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లాలో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ భార్యకు మరో పిడుగులాంటి వార్త.. తమ బ్యాంకులో మీ భర్త చేసిన మోసాలకు మీరే బాధ్యత వహించాలని, మరణించిన తర్వాత వచ్చే ఇన్సూ్యరెన్స్ చెల్లిస్తానని హామీ పత్రం రాయాలని బ్యాంకు అధికారుల బెదిరింపులు. లేకుంటే కేసు పెడతామని, పోలీసులు తీసుకెళ్తారని భయభ్రాంతులకు గురి చేసే మాటలు. దీంతో ఎటూ పాలుపోని బాధితురాలు ఉబికి వస్తున్న కన్నీటితో ఆస్పత్రి బయట కుప్పకూలి రెండు రోజులుగా అలాగే ఉండిపోయిన హృదయ విదారక ఘటన మంగళవారం వెలుగు చూసింది. ‘సాక్షి’ సేకరించిన వివరాల ప్రకారం..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కంకిపాడు మండలం ఉప్పులూరులో నివశించే మర్రివాడ వెంకయ్య స్థానికంగా ఉన్న బ్యాంకులో బంగారు రుణాలకు అప్రైజర్‌గా పని చేసేవాడు. మద్యానికి బానిసైన వెంకయ్య నిత్యం తాగుతూ ఉండేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో భార్య అనంతలక్ష్మి చికిత్స నిమిత్తం తొలుత ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రభుత్వాస్పత్రిలో చేర్చింది. ప్రాణాపాయస్థితిలో ఉన్న వెంకయ్య అక్యుట్ మెడికేర్ వార్డు (ఏఎంసీ) లో చికిత్స పొందుతున్నాడు. కోలుకోవడం కష్టమని, మూడు నాలుగు రోజులకన్నా ఎక్కువ బతకడని వైద్యులు తేల్చి చెప్పారు.
శవం ఇంటికి తేవద్దంటూ..
ఉప్పులూరులోని ఓ ఇంట్లో వెంకయ్య అద్దెకు ఉంటున్నాడు. కాగా అంపశయ్యపై ఉన్న విషయాన్ని తెలుసుకున్న యజమాని మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకు రావద్దంటూ హుకుం జారీ చేశాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో భార్య అనంతలక్ష్మి ఉండిపోయింది. రెండో తరగతి చదువుతున్న తమ కుమార్తెను ఆడబిడ్డ ఇంటికి పంపి ఆస్పత్రిలో ఒంటరిగానే ఉంటోంది.
గుండెను పిండేసే పిడుగులాంటి వార్త..
అంపశయ్యపై ఉన్న భర్త, మృతి చెందితే ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న అనంతలక్ష్మికి గుండెను పిండేసే పిడుగులాంటి వార్త మరొకటి తెలిసింది. తమ భర్త అప్రైజర్‌గా ఉన్న బ్యాంకు మేనేజర్ మరో ఇద్దరితో కలిసి ఆస్పత్రికి వచ్చి, మీ భర్త బ్యాంకును మోసం చేశాడని, అందుకు నీవే బాధ్యత వహించాలని చెప్పాడు. అంతేకాదు భర్త మృతి చెందిన తర్వాత వచ్చే ఇన్యూరెన్స్ డబ్బులు చెల్లిస్తానని హామీ పత్రం రాయాలని వత్తిడి చేశాడు. లేకుంటే కేసు పెడతామని, మిమ్మల్ని పోలీసు తీసుకెళ్తారంటూ బెదిరింపు ధోరణిలో వ్యవహరించడంతో ఏం చేయాలో తెలియక రెండు రోజులు కన్నీరు మున్నీరులా విలపిస్తూ ఉండిపోయింది. ఆమెను సమీప బెడ్‌ల వారు ఓదారుస్తూ ఉన్నారు.
నేనేం పాపం చేశాను..
‘నా భర్త మోసం చేశాడని చెపుతున్నారు. నాకే పాపం తెలియదు. ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యత వహించాలంటున్నారు. నా పేరు మీద కూడా రూ.లక్ష రుణం తీసుకున్నట్లు చెపుతున్నారు. వాటన్నింటినీ భర్త మృతి చెందితే వచ్చే ఇన్సూ్యరెన్స్ డబ్బులతో చెల్లించాలని వత్తిడి చేస్తున్నారు. మాకు ఎలాంటి ఆస్తులు లేవు. సొంతిల్లు కూడా లేదు.. ఏడేళ్ల కూతురు ఉంది. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఆయన ఇక బతకరని వైద్యులు చెప్పేశారు. శవాన్ని ఎక్కడకు తీసుకెళ్లాలో తెలియడం లేదు. మరోవైపు కేసు పెడతాం. నిన్ను తీసుకెళ్తారు.. అంటున్నారు.’ అని కన్నీటిపర్యంతమవుతూ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment